తెలంగాణకు కొత్తగా 54 పీజీ మెడికల్‌ సీట్లు

18 Jan, 2020 01:05 IST|Sakshi

మంజూరు చేసిన మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి 54 పీజీ మెడికల్‌ సీట్లను మంజూరు చేస్తూ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులిచ్చింది. ఈ సీట్లన్నీ నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీకే దక్కడం విశేషం. ఎంసీఐ నుంచి నిజామాబాద్‌ వైద్య విద్య కళాశాలకు శాశ్వత గుర్తింపు లభించిన ఏడాదికి ఒకేసారి 54 పీజీ సీట్లు మంజూరు కావడంపై వైద్య విద్య ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీకి మంజూరైన పీజీ సీట్లలో జనరల్‌ మెడిసిన్‌ – 10, అనస్థీషియా – 6, గైనకాలజీ – 6, ఆర్థోపెడిక్స్‌ – 4, అనాటమీ – 4, ఈఎన్‌టీ – 3, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ – 3, ఫిజియాలజీ – 2, పీడియాట్రిక్‌ – 3, సైకియాట్రీ – 2, అప్తామాలజీ – 3, పాథాలజీ – 3, మైక్రోబయాలజీ – 3, బయో కెమిస్ట్రీ – 2 ఉన్నాయి.

ఇదే కాలేజీకి గతేడాది 3 పీజీ ఫార్మాకాలజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నీట్‌ పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఏడాది మార్చి – ఏప్రిల్‌ నెలలో నిజామాబాద్‌ కాలేజీలో పీజీ అడ్మిషన్లు ఇస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 706 పీజీ సీట్లుండగా, 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 917 సీట్లున్నాయి. మొత్తం అన్నీ కలిపి 1,623 పీజీ సీట్లున్నాయి. కొత్తగా వచ్చిన 54 సీట్లతో కలపి ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోనే 760 సీట్లు అవుతాయి.

మరిన్ని వార్తలు