మాటువేసిన మాయదారిరోగం

19 Aug, 2018 02:13 IST|Sakshi

     రాష్ట్రంలో ఏడాదికి 58 వేల కొత్త కేన్సర్‌ రోగులు

     టాటా ట్రస్ట్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక–2018లో వెల్లడి

     తెలంగాణలో కేన్సర్‌ రోగుల రేటు లక్షకు 143 మంది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఏడాదికి కొత్తగా 58 వేల మంది కేన్సర్‌ బారిన పడుతున్నారని టాటా ట్రస్టు తెలిపింది. తెలంగాణలో కేన్సర్‌ వ్యాధి వ్యాప్తిపై ‘టాటా ట్రస్ట్‌’సమగ్ర ప్రాజెక్టు నివేదిక–2018ను తాజాగా విడుదల చేసింది.  కేన్సర్‌ బారిన పడుతున్న 58 వేల మందిలో 45 వేల మంది కింది మధ్యతరగతి ఆదాయ వర్గాలేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కేన్సర్‌ బారిన పడుతున్న వారి రేటు పురుషుల్లో లక్షకు 85, స్త్రీలలో 125గా ఉండటం గమనార్హం. అయితే అనేకచోట్ల కేన్సర్‌ రోగులు నమోదు కావటం లేదు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్షకు 143గా ఈ రేటు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దేశం లో ఈ రేటు పురుషుల్లో 110, స్త్రీలలో 102గా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేన్సర్‌ రోగుల్లో అత్యధికంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ కేన్సర్‌కు గురవుతున్న వారు 23% మంది ఉన్నారు. పొగాకు కారణంగా 15%కేన్సర్‌కు గురవుతున్నారు. 12%  మంది గైనిక్‌ సంబంధిత కేన్సర్‌కు గురవుతున్నారు.  

థర్డ్‌ స్టేజ్‌లోనే ఆసుపత్రులకు...  
ఇతర అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇండియాలో కేన్సర్‌ పెరుగుదల రేటు తక్కువగా కనిపిస్తుంది. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి ఉందని కాదు. తక్కువ కనిపిస్తుండ టానికి ప్రధాన కారణం కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం, రోగం వచ్చినా కూడా నమోదు కాకపోవడంగా నివేదిక తెలిపింది. అంతేకాదు కేన్సర్‌ సోకిన వారిలో 50 శాతం మంది థర్డ్‌ స్టేజీలోనే మొదటిసారి వైద్యానికి వస్తున్నారు. దీంతో భారీగా  మరణాల రేటు నమోదవుతోంది. పైగా వైద్య వసతి లేకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. భారత్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కేన్సర్‌ చికిత్సకు రూ.4 లక్షల నుం చి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇప్పు డున్న రోగులకు వైద్యం చేయాలంటేనే దేశవ్యాప్తంగా 850 సమగ్ర ఆసుపత్రులు అవసరం.  కేవలం 400 మాత్రమే అందుబాటులో ఉండ గా.. 67 శాతం ప్రైవేట్‌ రంగంలోనే అందుబాటులో ఉన్నాయి.  తెలంగాణకు వస్తే మొత్తం 25 సమగ్ర కేన్సర్‌ ఆసుపత్రులుండగా, అం దులో 3 మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నా యి. నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రి, వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో కేన్సర్‌ చికిత్స అందుబాటులో ఉంది. 30 రేడియోథెర పీ మిషన్లు ఉంటే అందులో 25 ప్రైవేట్‌ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. విచిత్రమేమంటే రాష్ట్రంలో 800 ప్రభుత్వ ఆసుపత్రులుంటే, కేవ లం మూడింటిలోనే  వ్యాధికి వైద్యం అందుతోంది.  

ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి...  
ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల కేన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. రోగుల్లో ఎక్కువ మంది దిగువ మధ్య తరగతికి చెందిన వారే ఉంటుండటంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులపై పడుతోంది. అయితే ఆరోగ్యశ్రీ కింద రోగికి రూ.లక్షన్నర  వరకే అనుమతి ఉండటంతో చాలావరకు ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు ఏడాదికి 12 వేల మంది కేన్సర్‌ రోగులకు చికిత్స చేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు 10 వేల మందికి చికిత్స చేస్తున్నాయి.  

12 కేంద్రాల్లో చికిత్సకు ప్రతిపాదనలు...  
రోగుల సంఖ్యకు తగ్గట్లు కేన్సర్‌ చికిత్స అందుబాటులో లేకపోవడంతో టాటా ట్రస్ట్‌ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిమ్స్‌సహా 12 కేంద్రాల్లో కేన్సర్‌ చికిత్స అందజేయాలని ప్రతిపాదించింది. వాటి ద్వారా 70 శాతం రోగులకు చికిత్స అందిస్తారు. పైగా రాష్ట్రంలో ఎక్కడివారైనా ఒకట్రెండు గంటల్లో వెళ్లి వైద్యం చేయించుకునేలా పలుచోట్ల ఆయా కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. అంతేకాదు టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో 250 పడకలతో కేన్సర్‌ ఆస్పత్రి నెలకొల్పాలని భావిస్తుంది.   

మరిన్ని వార్తలు