తెలంగాణలో కరోనాతో తొలి మరణం

28 Mar, 2020 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనాతో తొలి మరణం నమోదైంది. ఖైరతాబాద్‌లో కరోనాతో వృద్ధుడు(74) మృతి చెందాడు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోతే అతని రక్త నమూనాలు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. చనిపోయిన వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నెల 14న మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన వృద్ధుడు 17న తిరిగి వచ్చారు. 20న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి అతను మృతిచెందాడు. వృద్ధుడి మృతదేహాన్ని ఆరోగ్య శాఖ సూచనలమేరకు కుటుంబ సభ్యులు సైఫాబాద్‌ పోలీసుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని ఈటల తెలిపారు.

'ఇవాళ కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 65కు చేరుకుంది. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో గొప్ప వసతులతో కరోనా వార్డులు ఏర్పాటు చేశాం. కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలి. క్వారంటైన్‌ నుంచి తప్పించుకోవాలని చూడొద్దు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా ఉండాలి.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా మందిరాలకు ప్రజలు వెళ్లకపోవడమే మంచిది. పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి, కుత్బుల్లాపూర్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేస్తున్నాము' అని ఈటల అన్నారు.  (కరోనా: కేంద్ర బలగాలు రావట్లేదు)

>
మరిన్ని వార్తలు