పత్తికి స్వస్తేనా?

26 Jun, 2014 00:32 IST|Sakshi
పత్తికి స్వస్తేనా?

అదను దాటుతోంది
- వారంలోగా వానలు పడకపోతే పత్తి సాగు కష్టమే
- విత్తడానికి మిగిలింది ఇక కొద్ది రోజులే  
- ఆ తర్వాత విత్తుకుంటే దిగుబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ.. వ్యవసాయాధికారుల సూచన
- రైతుల్లో మొదలైన గుబులు
- డివిజన్‌లో పత్తి సాగుకు ఇప్పటికే రూ. ఆరు కోట్ల ఖర్చు

యాచారం: బ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లో సుమారు 5 వేల మంది రైతులు నాలుగన్నర వేల హెక్టార్లలో ఈసారి పత్తి సాగుకు సిద్ధమయ్యారు.సీజన్‌కు ముందే మురిపించిన వర్షాలతో పత్తి విత్తులు విత్తేందుకు రెడీ అయ్యారు. మృగశిర కార్తెలో వర్షాలు పడకపోవడం, ఆరుద్ర కార్తె వచ్చి నాలుగు రోజులవుతున్నా వానల జాడే లేకుండాపోయింది.

పత్తిలో మంచి ఎదుగుదల, పూత, కాత ఉండాలంటే మృగశిరలోనే విత్తనాలు విత్తాలి. దీంతో పంటలో మంచి ఎదుగుదల ఉంటుంది. దిగుబడి అధికంగా రావడమే కాకుండా నిర్వహణ ఖర్చుల భారం కూడా తగ్గుతుంది. విత్తు విత్తిన నాటి నుంచి 160 రోజుల్లో దిగుబడి పూర్తిగా చేతికొస్తుంది. కానీ విత్తే  అదను 20 రోజులు దాటిపోయింది. ఇకనైనా వర్షాలు కురుస్తాయా.. ఈసారి పత్తి సాగు చేస్తామా లేదా అని రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే విత్తిన పత్తి మొలకల కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
 
ఇప్పటికే రూ. ఆరు కోట్ల పెట్టుబడులు..  
డివిజన్‌లోని పలువురు రైతులు పత్తి పంట సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే మూడు ప్యాకెట్ల (బీటీ) విత్తనాలు (రూ.3 వేలు), బస్తా ఎరువు (రూ.1,300), దుక్కులు (4 గంటలకు రూ.2 వేలు) దున్నుకున్నారు. వర్షాలు పడిన వెంటనే విత్తులు విత్తేందుకు కూలీలకు రూ. వేలల్లో అడ్వాన్సు సైతం ఇచ్చారు. ఇలా ఒక్కో ఎకరానికి దాదాపు రూ.5వేలకుపైగా ఖర్చు చేశారు.
 
డివిజన్‌లోని మూడు మండలాల రైతులు దాదాపు పది వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేసేందుకు సంసిద్ధులయ్యారు. కూలీ ఖర్చులు, ఎరువులు, పురుగుల మందులు మినహాయించి కేవలం విత్తనాలు, భూమిలో పెట్టే ఎరువులు, దున్నడం కోసం దాదాపు రూ. 6 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఒక్కో రైతు 5 నుంచి 15 ఎకరాలకుపైగా సాగు చేయడానికి భూమిని సిద్ధంగా ఉంచుకున్నారు.

నెలరోజుల క్రితం కురిసిన వర్షాలతో పొలాలను దున్నుకున్నారు. మళ్లీ కలుపు పెరగడంతో వేల రూపాయలు అదనంగా ఖర్చు చేసి దుక్కులు దున్నించుకున్నారు. ఈ క్రమంలో వారం రోజుల్లో వర్షాలు పడని పక్షంలో పంటమార్పిడి చేయాల్సి వస్తే.. ఇప్పటికే చేసిన ఖర్చు అప్పు కావాల్సిందేనని ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు