నబీల్ మృతదేహానికి ఆరుచోట్ల గాయాలు

12 May, 2015 03:20 IST|Sakshi
నబీల్ మృతదేహానికి ఆరుచోట్ల గాయాలు

హైదరాబాద్: నగరానికి చెందిన ఫంజెషాలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లో మృతి చెందిన నబీల్ మహ్మద్(17)కు బార్కాస్‌లోని బడా శ్మశాన వాటికలో సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అతని మృతదేహంపై ఆరుగాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఉదయం 11 గంటలకు బండ్లగూడ మండల తహసీల్దార్ మహ్మద్ జహురుద్దీన్, కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఇంక్వెస్ట్ డిప్యూటీ తహసీల్దార్ అమర జ్యోతిలు పోలీసుల సమక్షంలో శవ పంచనామా జరిపారు.  అనంతరం 12.30 గంటల సమయంలో శ్మశాన వాటికకు వచ్చిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవరాజు బృందం నబీల్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపారు.

ఈ సందర్భంగా నబీల్ శరీరంపై ఆరు ప్రదేశాలలో గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. గాయపడ్డ భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని మంగళవారం  ఉదయానికి నివేదికను సిద్ధంచేసి పోలీసులకు అందజేస్తామని వైద్యుల బృందం తెలిపింది. పోస్ట్‌మార్టం జరుగుతున్న సమయంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబూరావు, చార్మినార్ ఏసీపీ కె.అశోక చక్రవర్తిలు శ్మశాన వాటికకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహాన్ని తిరిగి పూడ్చారు. నివేదిక అందగానే హత్య కేసు నమోదు చేస్తామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఈ కేసులో ప్రేమ వ్యవహారం అన్న కోణంలో ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.


పోలీసుల అదుపులో 9మందిఙఞ్చటకాగా నబీల్ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), మహ్మద్ ఉమర్ బేగ్ (20), ఇర్ఫాన్ పఠాన్ (22), సుల్తాన్ మీర్జా (22), ఎం.ఎ. కవి ఆలియాస్ ఓబేద్ (18), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (20), అబుబాకర్ (19), సులేమాన్ (18), సయ్యద్ యూసుఫ్ అహ్మద్ (19)లపై పోలీసులు ఐపీసీ 302, 201, 109, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
తన కుమారుడికి మరో రెండు నెలల్లో మైనార్టీ తీరనుండడంతో అతడ్ని దుబాయికి పంపాలని భావించాననీ నబీల్ తండ్రి దస్తగిర్ తెలిపారు. ఈ నెల మూడో తేదీ తెల్లవారు జాము 3 గంటల వరకూ తమ కుమారుడు తమ బంధువుల ఇంటి వద్దే ఉన్నాడనీ, అతని స్నేహితులు స్ట్రీట్ ఫైటింగ్ పేరిట తీసుకెళ్లి హత్యచేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇందులో ఉమర్ బేగ్ అనే అతని ప్రమేయ ముందని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన ఒక్కగానొక్క కుమారుడికి ఇలా జరగడం పట్ల కన్నీరు పెట్టారు.

మరిన్ని వార్తలు