శిక్షణకు 606 మంది డుమ్మా

31 Mar, 2014 03:50 IST|Sakshi

హన్మకొండ, న్యూస్‌లైన్ : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఏకంగా 606 మంది అధికారులు డుమ్మా కొట్టారంటే విధులపై వారికి ఉన్న గౌరవం ఎంతటిదో ఇట్టే అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2234 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేష న్‌లో ఒక్కో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను నియమించారు.
 
ఈ మేరకు విధులు వేస్తున్నట్లు నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తం 4468 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతోపాటు 10 శాతం మందికి అదనంగా విధులు కేటాయించారు. మొత్తం 4920 మంది అధికారులకు స్థానిక సంస్థల ఎన్నికలకు విధులు కేటాయించారు.
 
 ఎన్నికల విధుల జాబితాపై నిర్లక్ష్యమా?
జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో 27, 28వ తేదీల్లో వీరికి మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆయా సెగ్మెంట్ల లో మొత్తం 606 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు వీరి జాబితా ను తీసుకున్నారు. కాగా, డీఈఓ కార్యాలయం నుంచి పంపించిన జాబితా అస్పష్టంగా ఉన్నట్లు వెల్లడైంది. కొంతమంది వివరాలు సరిగా లేవని, దీంతో వారికి సమాచారమే అందలేని గుర్తిం చారు.
 
ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షల విధులు కేటాయించడంతో ఒక్కొక్కరికి రెండేసి విధులు పడ్డాయని, దీంతో వివరాలు లోపించాయంటూ డీఈఓ కార్యాలయం అధికారులు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎన్నికల విధులకు సంబంధించిన జాబితాను ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా డీఈఓకు సంజాయిషీ నోటీసు జారీ చేయాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈఓ నుంచి ఈ నోటీసు వెలువడక ముందే డీఈఓ కార్యాలయం నుంచి హడావుడిగా మరో జాబితాను పంపించారు.
 
 ఎందుకు రాలేదంటే..
 ప్రస్తుతం ఒకేసారి మూడు ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో ఇప్పటికే సిబ్బంది పూర్తి జాబితాను సిద్ధం చేసి నివేదించామని, వారిలో కొంతమంది ఎన్నికల విధులను తేలిగ్గా తీసుకున్నారంటూ ఈసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసీ నుంచి 606 మందికి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లోనే సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులు జారీ అయిన వారిలో 400 మంది విద్యాశాఖకు చెందిన వారు ఉండగా, 206 మందిలో ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు