మరో  62 కరోనా కేసులు

6 Apr, 2020 02:12 IST|Sakshi

మొత్తం 333 మందికి పాజిటివ్‌

వీటిలో 297 కేసులు ‘మర్కజ్‌’వే..

హైదరాబాద్‌లోనే 162 మందికి..

రాష్ట్రంలో 25 జిల్లాలకు పాకిన మహమ్మారి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం మళ్లీ 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 333కు చేరుకుంది. అందులో 297 మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబం ధం ఉన్నవారు, వారి కుటుంబీకులే కావడం గమనార్హం. అంటే మొత్తం కేసుల్లో 89 శాతం మంది ఏకంగా ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన వారు వివిధ దేశాల నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకులు, స్థానికంగా ఎటువంటి కాంటాక్ట్‌తో సంబంధం లేకుండా సోకిన వారున్నారన్నారు. ఆదివారం 480 మందికి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయగా, ఈ ఫలితాలు వచ్చాయి. కాగా, కరోనా కేసుల్లో ఇప్పుడు దేశంలో తెలం గాణ రాష్ట్రం పైపైకి చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఒక్కరోజులో 51..
ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే ఉన్నాయి. ఇక్కడ 162 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకరోజు వ్యవధిలోనే 51 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. 11 మంది డిశ్చార్జి అయ్యారు. వరంగల్‌ అర్బన్‌లో 24 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో ఒకరు  డిశ్చార్జి అయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో 19 నమోదు కాగా, ఒకరు చనిపోయారు. కాగా, తెలంగాణలోని 25 జిల్లాలకు కరోనా పాకింది. సోమవారం మరో 600 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశముంది.

తప్పులతడకగా బులెటిన్‌:
ఆదివారం ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక తప్పులతడకగా ఉంది. శనివారం నాటికి 272 కేసు లు నమోదు కాగా, సోమవారం 333 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కానీ ఆ రెండింటి తేడా 61 మాత్రమే. కానీ 62 కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. ఏది సరైన సంఖ్యో  స్పష్టత లేదు. దీనిపై వివరణ అడిగేందుకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఫోన్‌ ద్వారా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన ఫోన్‌ కట్‌ చేశారు. ఇక శనివారం వరంగల్‌ రూరల్‌లో కేసులు నమోదైనట్లు ప్రస్తావించారు. ఆదివారం రిపోర్టులో మాత్రం ఆ జిల్లా పేరు లేదు.  కారణాలు ఏమిటో ఏ అధికారీ వివరణ ఇవ్వలేదు. కొందరు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోగా, ఇంకొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది.

మరిన్ని వార్తలు