నజరానా.. హైరానా!

23 May, 2015 23:53 IST|Sakshi

నగదు ప్రోత్సాహకం కోసం రెండేళ్లుగా ఎదురుచూపు
జిల్లాలో 62 ఏకగ్రీవ పంచాయతీలు
నజారానా పెంచుతున్నట్లు ప్రకటన
ఇప్పటికీ నయాపైసా విదల్చని సర్కార్
{పభుత్వం తీరుపై సర్పంచ్‌ల అసంతృప్తి

 
 ఏకగ్రీవ పంచాయతీలకు రిక్తహస్తం
  ‘ఎన్నికలు వద్దు ఏకగ్రీవం ముద్దు.. ఏకగ్రీవమైతే నజరానా’ అంటూ పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రోత్సహించిన సర్కార్ ఇప్పుడు ముఖం చాటేస్తోంది. సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకుని ప్రభుత్వం అందజేసే నజరానాతో పల్లెలు బాగుచేసుకుందామనుకున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు రెండేళ్లుగా నజారానా కోసం ఎదురుచూస్తున్నా ఫలితం కానరావటంలేదు. గత పాలకుల కంటే నజారానా పెంచుతున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు నయాపైసా విదల్చలేదు.
 
 అభివృద్ధి నిల్
 గ్రామాభివృద్ధిని కోరి గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. రెండేళ్లయినా నగదు ప్రోత్సాహకం ఇవ్వకపోవడంతో గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు.
 అందోల్ కృష్ణ, చక్రియాల సర్పంచ్,  సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు
 
 సాక్షి, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ మైనర్ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం రూ.7 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.15 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. జిల్లాలో 62 పంచాయతీలు ఏకగ్రీవం కాగా వీటిలో పలు పంచాయతీలకు సొంత భవనాలు లేవు. మౌలిక సదుపాయాలూ కరువయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహక నగదుతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని సర్పంచ్‌లు భావించారు. అయితే నజరానా అందకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు.

 రెండేళ్లుగా ఎదురుచూపులు..
 జిల్లాలో మొత్తం 1,066 పంచాయతీలకు 2013-జూలైలో 26, 29, 31 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 29 మండలాల్లోని 62 పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి రెండేళ్లుగా సర్పంచ్‌లు తమకు రావాల్సిన నగదు ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు అందే ప్రోత్సాహకాలతో సర్పంచ్‌లు గ్రామంలో పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణంతోపాటు రోడ్లు వేసుకోవచ్చు.

అయితే ప్రభుత్వం ఇంకా నజారానా అందజేయకపోవటంతో తమ పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోందని వాపోతున్నారు. కాగా 2009లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం మేజర్, మైనర్ పంచాయతీలకు అన్న తేడా లేకుండా అన్ని పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికి ఇస్తుందోనని సర్పంచ్‌లు ఎదురుతెన్నులు చూస్తున్నారు.
 
 రెండేళ్లుగా ఎదురుతెన్నులే..
 ప్రభుత్వం నజరానాను ప్రకటించినా నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. నిధులు మంజూరైతే గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, ఇతర చిన్న చిన్న అభివృద్ధి పనులు జరిగేవి.
 - పెద్దగోల్ల మల్లమ్మ, సర్పంచు కంబాలపల్లి

 ప్రభుత్వానికి లేఖ రాశాం
 జిల్లాలో 62 ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశాం. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినందున త్వరలోనే నగదు ప్రోత్సాహకాలు అందజేసే అవకాశం ఉంది.
 -  సురేశ్‌బాబు, డీపీఓ

మరిన్ని వార్తలు