పల్లెల్లో గులాబీ పండుగ! 

14 Jan, 2019 03:04 IST|Sakshi

తొలివిడతలో 763 పంచాయతీలు

ఏకగ్రీవం.. టీఆర్‌ఎస్‌ ఖాతాలో 662 

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆదివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత తొలి విడతలో 763 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో దాదాపు 662 పంచాయతీలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ 38 పంచాయతీలతో సరిపెట్టుకోగా.. స్వతంత్రులు 49 పంచాయతీల్లో గెలిచారు. న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు 6, సీపీఎం మద్దతుదారులు 4, సీపీఐ, టీడీపీ, బీజేపీ చెరొక పంచాయతీని దక్కించుకున్నాయి.

తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం మొదటిదశ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా విడుదలైన నేపథ్యంలో సర్పంచ్, వార్డుమెంబర్‌ స్థానాలకు పోటీ చేస్తున్న వారికి రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. సోమవారం నుంచి గుర్తులతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కానున్నారు. 

ముగిసిన రెండో విడత నామినేషన్లు 
రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఆదివారంతో ముగిసింది. సోమవారం నామినేషన్లను పరిశీలించి పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలనలో తీసుకున్న నిర్ణయాలపై అప్పీళ్లను స్వీకరించి 16 నాటికి పరిష్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 17 వరకు అవకాశం ఉండనుంది. 25న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.  

మరిన్ని వార్తలు