మెయిల్‌తో మోసం చేశారు..

19 Mar, 2020 08:20 IST|Sakshi

డిస్‌ప్లే నేమ్‌తో దోచేశారు!

పిట్టీ ఇంజినీరింగ్‌ సంస్థకు సైబర్‌ నేరగాళ్ల టోకరా

దాని సీఎండీనే పంపినట్లు సీఎఫ్‌ఓకు ఈ–మెయిల్‌

తమ ఖాతాలోకి రూ.6.8 లక్షలు వేయించుకున్న వైనం

కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌

సాక్షి, సిటీబ్యూరో:  నగరంలోని సోమాజిగూడ కేంద్రంగా పని చేసే పిట్టీ ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థకు సైబర్‌ నేరగాళ్ళు నకిలీ ఈ–మెయిల్‌ ద్వారా టోకరా వేశారు. ఆ సంస్థ  చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పేరును డిస్‌ప్లే నేమ్‌గా పెట్టి బోగస్‌ మెయిల్‌ ఐడీ సృష్టించారు. దీని ఆధారంగా దాని చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌కు (సీఎఫ్‌ఓ) మెయిల్‌ పంపించి రూ.6.8 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. చివరకు విషయం తెలుసుకున్న పిట్టీ సంస్థ నిర్వాహకులు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో బుధవారం కేసు నమోదైంది. పిట్టీ ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థకు శరద్‌ బి.పిట్టీ సీఎండీగా, ఎన్‌కే ఖండెల్‌వాలా సీఎఫ్‌ఓగా పని చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరి మెయిల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్ళు అందులోని ఉత్తరప్రత్యుత్తరాలు, వారు వినియోగించే భాష, ఏర్పాటు చేసుకున్న డిస్‌ప్లే నేమ్స్‌ తదితర అంశాలు పరిశీలించారు. ఎవరికీ అనుమానం కాకుండా ఉండేందుకు సైబర్‌ నేరగాళ్ళు వీళ్ళ ఇన్‌బాక్సుల్లోని అన్‌రెడ్‌ మెయిల్స్‌ జోలికి వెళ్ళలేదు. వాటిని తెరిస్తే అనుమానం వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో అప్పటికే వాళ్ళు చదివేసిన మెయిల్స్‌ను (రెడ్‌) మాత్రమే పరిశీలించారు. దీని ఆధారంగా వారి ఉత్తరప్రత్యుత్తరాలపై సైబర్‌ నేరగాళ్ళు ఓ స్పష్టత సాధించారు. ఆపై మరో అంకం ప్రారంభించిన సైబర్‌ క్రిమినల్స్‌ శరద్‌ బి.పిట్టీ అనేది డిస్‌ప్లే నేమ్‌గా కనిపించేలా (hortensiacgarcia@cox.net) పేరుతో ఈ–మెయిల్‌ ఐడీ సృష్టించారు.

ఒకే డిస్‌ప్లే నేమ్స్‌ ఎందరైనా పెట్టుకునే అవకాశం ఉండటం వీరికి కలిసి వచ్చింది. దీని ఆధారంగా మంగళవారం ఉదయం 11.18 నిమిషాలకు సీఎఫ్‌ఓకు మెయిల్‌ పంపారు. తన ఐ–ఫోన్‌లో ఈ మెయిల్‌ను చూసిన ఆయన కేవలం డిస్‌ప్లే నేమ్‌ ఆధారంగా అది తన సీఎండీ పంపినట్లు ఆయన భావించారు. అందులో ఉన్న అంశాలను పరిశీలించగా.. తాను మీటింగ్స్‌లో బిజీగా ఉన్నానని, ఓ ఖాతాకు రూ.6.8 లక్షలు తక్షణం బదిలీ చేయాలంటూ ఉంది. ఇది తన యజమాని నుంచే వచ్చి ఉంటుందని భావించిన ఖండెల్‌వాలా ఏ ఖాతాకు పంపాలంటూ? జవాబు ఇచ్చారు. దీన్ని అందుకున్న సైబర్‌ నేరగాళ్ళు పిట్టీ సంస్థ సీఎండీ మాదిరిగానే ముంబైకి చెందిన లక్ష్మీ ట్రేడర్స్‌ అనే సంస్థకు పంపాలంటూ మరో మెయిల్‌ పంపారు. ఆ వెంటనే నగదు పంపావా? అలా చేస్తే ఆ విషయం నాకు చెప్పాలి... అంటూ మరో సందేశాన్నీ పంపారు. ఇవన్నీ తన సీఎండీ నుంచే వస్తున్నాయని భావించిన ఖండెల్‌వాలా రూ.6.8 లక్షల్ని సదరు ఖాతాలోకి బదిలీ చేశారు.

ఆ ఖాతా కరెంట్‌ అకౌంట్‌ కావడంతో ఖండెల్‌వాలాకు అనుమానం కూడా రాలేదు. ఇదే విషయాన్ని తన యజమానిగా భావిస్తూ సైబర్‌ నేరగాళ్ళకూ సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత తన యజమానిని సంప్రదించిన సీఎఫ్‌ఓ మీరు చెప్పినట్లే నగదు బదిలీ చేశానంటూ చెప్పారు. తాను అలాంటి మెయిల్స్‌ ఏవీ పంపలేదని ఆయన చెప్పడంతో అవాక్కైన సీఎఫ్‌ఓ తనకు వచ్చిన వాటిని చూపించారు. దీంతో మోసపోయామని భావించిన పిట్టీ సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి లక్ష్మీ ట్రేడర్స్‌ పేరుతో ఉన్న ఖాతా ముంబైలోని అం«థేరీ వెస్ట్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేరగాళ్ళను పట్టుకోవడానికి సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు.

పూర్తిగా సరి చూసుకోవాల్సిందే
ఈ తరహా సైబర్‌ నేరాల బారిన ప్రస్తుతం అనేక సంస్థలు పడుతున్నాయి. ఒకే పేరు ఈ–మెయల్‌ ఐడీని వేర్వేరు వ్యక్తులు క్రియేట్‌ చేసుకోవం సా«ధ్యం కాదు. అలా చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ‘దిస్‌ యూజర్‌ నేమ్‌ ఈజ్‌ టేకెన్‌. ట్రై అనెదర్‌’ అంటూ సందేశం వస్తుంది. అయితే ఒకే డిస్‌ప్లే నేమ్‌ను ఎందరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్నే సైబర్‌ నేరగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఈ–మెయిల్స్‌కు స్పందించే ముందు వాటిని పూర్తిగా ఓపెన్‌ చేయాలి. కేవలం డిస్‌ప్లే నేమ్‌ మాత్రమే చూసి కాకుండా పూర్తి మెయిల్‌ ఐడీ, అందులోని స్పెల్లింగ్స్‌ క్షుణ్ణంగా పరిశీలించాలి. అవసరమైతే ఎదుటి వ్యక్తిని నేరుగా లేదా ఫోన్‌ ద్వారా సంప్రదించి, ఖరారు చేసుకున్నాకే నగదు బదిలీ చేయాలి. ఆయా సంస్థలు పటిష్టమైన ఫైర్‌ వాల్స్‌ ఏర్పాటు చేసుకుని హ్యాకింగ్‌కు గురికాకుండా చూసుకోవాలి.– ఎన్‌.మోహన్‌రావు, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌

మరిన్ని వార్తలు