ఎల్‌బీ నగర్‌లో కరోనా విజృంభణ

18 Jul, 2020 08:13 IST|Sakshi

కొనసాగుతున్న కరోనా విజృంభణ

ఎల్‌బీ నగర్‌లో ఒక్క రోజే 69 మందికి పాజిటివ్‌

ఎల్‌బీనగర్‌: ఎల్బీనగర్‌లోని మూడు, నాలుగు, అయిదు సర్కిళ్ల  పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండానే వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దగ్గు, జ్వరం వంటి సీజనల్‌ వ్యాధుల బారిన పడిన వారు సైతం తమకు కరోనా వచ్చిందేమోనని వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరికొందరు ఇంటివద్దే తమకు తెలిసిన వైద్య పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇప్పటికే ఎల్‌బీనగర్‌ జోన్‌ పరిధిలో 459 మంది వైరస్‌ బారిన పడి మంచానికే పరిమితమై హౌస్‌ క్వారంటైన్‌లో ఉండగా... మరికొందరు గాంధీ, ఇతర ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఒక్క  శుక్రవారం రోజే చంపాపేట, హయత్‌నగర్, వనస్థలీపురం, బీఎన్‌రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్, సరూర్‌నగర్, ఎల్‌బినగర్‌ వంటి పలు ప్రాంతాలలో 69 మందికి కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనా పాజిటివ్‌ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అనుమానితులను హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో పరిశీలన చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  నిర్దారణ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. 

కాప్రా సర్కిల్‌లో 8 కొత్త కేసులు
కాప్రా: సర్కిల్‌ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా మరో 8 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వైరస్‌తో మరో వ్యక్తి మృతి చెందాడు. కొత్త నమోదైన కేసుల్లో కాప్రా డివిజన్‌ సాకేత్‌లో 47 ఏళ్ల వ్యక్తి, ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిమళనగర్‌లో 46 ఏళ్ల వ్యక్తి, భవానీనగర్‌లో 39 ఏళ్ల వ్యక్తి, మీర్‌పేట్‌–హెచ్‌బీకాలనీ డివిజన్‌ ఏపీహెచ్‌బీ కాలనీలో 37 ఏళ్ల వ్యక్తి, మల్లాపూర్‌లో ఇద్దరికి, నాచారంలో ఓ మహిళతో పాటు మరో వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు సర్కిల్‌ పరిధిలో 224 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, మృతుల సంఖ్య 6కు చేరింది.  కరోనాను జయించి 112 మంది డిశ్చార్జ్‌ కాగా, 106 యాక్టివ్‌ కేసులున్నాయి.  మరో వైపు జమ్మిగడ్డ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 77 ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 23 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారి స్వప్నారెడ్డి తెలిపారు

ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిధిలో...
ఉప్పల్‌: ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిధిలో శుక్రవారం 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

బోడుప్పల్‌లో 8 మందికి..
బోడుప్పల్‌: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో శుక్రవారం 8 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. హేమానగర్‌కు చెందిన ఓ వృద్ధుడు (75) చికిత్స పొందుతూ చనిపోయాడు. బోడుప్పల్, చిలుకానగర్, శ్రీసాయినగర్, సుభాష్‌నగర్, సూరజ్‌నగర్‌ కాలనీ, వీరారెడ్డినగర్, చెంగిచర్ల కమలానగర్‌లో ఒక్కొక్కరికి పాజిటివ్‌ రావడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. 

మేడ్చల్‌లో 32కి చేరిన కేసులు
మేడ్చల్‌: మేడ్చల్‌ కమ్యూనిటీ ఆసుపత్రిలో శుక్రవారం 101 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా... 22 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యురాలు మంజుల తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి మందులు ఇచ్చి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించామన్నారు. దీంతో మేడ్చల్‌లో కేసుల సంఖ్య 32కి చేరింది. కాగా, పరీక్షలు తిరిగి సోమవారం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

కొండాపూర్‌ ఏరియా ఆసుప్రతిలో...
గచ్చిబౌలి: కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 189 మందికి  పరీక్షలు నిర్వహించగా అందులో 31 మందికి పాజిటివ్, 158 మందికి నెగెటివ్‌ వచ్చిందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథ్‌ తెలిపారు.

‘ఫీవర్‌’లో 438 మందికి పరీక్షలు
నల్లకుంట: నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో శుక్రవారం 438 మంది అనుమానితులు కోవిడ్‌  పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 38 మందికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

బాలాపూర్‌లో 23 మందికి...
మీర్‌పేట: బాలాపూర్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం 77 మందికి కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్‌ ఉమాదేవి తెలిపారు. వీరిలో 23 మందికి పాజిటివ్‌గా తేలడంతో వారిని హోం క్వారంటైన్‌ చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు