ఆర్నెల్లలో అభివృద్ధి అవుతుందా?: కేటీఆర్

24 Feb, 2015 03:51 IST|Sakshi

ముస్తాబాద్: ‘ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేస్తే గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. అరవై ఏళ్లలో చేయని పనులు ఆరు నెలల్లో ఎలా చేస్తారు. కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. పేదల అభివృద్ధి కోసం ఎవరూ చేయని పనులను చేస్తున్నందుకే జైల్లో పెట్టాలా?’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాలకు సాగునీరందించే ఎగువమానేరు హైలెవెల్ కెనాల్ పనులను సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీమాంధ్రులు అప్పులు పంచి ఆస్తులు పట్టుకుపోయారని, తెలంగాణ అభివృద్ధికి సమయం పడుతుంద న్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పథకంలో 46 వేల చెరువులను రూ. 26 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం గంభీరావుపేట మండలం ఎగువమానేరు గెస్ట్‌హస్‌లోప్రాణహిత-చేవెళ్ల, మిషన్ కాకతీయ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైరపర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మద్దికుంట రైతు బహిరంగసభలో  కేటీఆర్ మాట్లాడుతూ తన్నీరు అంటే మంచినీరని, మంత్రి తన్నీరు హరీశ్ మెట్ట ప్రాంతానికి నీరందించాలని ఛలోక్తి విసిరారు.

మరిన్ని వార్తలు