మెదక్‌..కూ..చుక్‌ చుక్‌!

20 Dec, 2018 01:23 IST|Sakshi

అక్కన్నపేట–మెదక్‌ మార్గంలో పనులు కొలిక్కి

మార్చి చివరికి పూర్తి.. తర్వాత ట్రయల్‌ రన్‌

సాకారం కానున్న మెదక్‌ వాసుల 7 దశాబ్దాల కల  

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దాలుగా రైలు కూత వినాలన్న మెదక్‌ వాసుల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. మరో 3 నెలల్లో మెదక్‌ వాసులకు తొలిరైలు కూత వినిపించనుంది. అక్కన్నపేట–మెదక్‌ పట్టణాలను కలుపుతూ నిర్మిస్తోన్న రైల్వే లైను పనులు దాదాపు పూర్తయ్యాయి. 2019 మార్చి చివరి నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి, ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పట్టుదలగా ఉన్నారు. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ వేసిన ఈ లైన్‌ మార్గం ద్వారా మెదక్‌ నుంచి రాజధానికి కనెక్టివిటీ పెరగనుంది. ఈ ప్రాంతంలో రవాణా మెరుగుపడి, మెదక్‌ పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 7 దశాబ్దాల తర్వాత మెదక్‌ పట్టణ వాసుల కల నెరవేరుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చొరవతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయగలిగామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ తెలిపారు.

ఇదీ ప్రాజెక్టు నేపథ్యం..
రాజధాని హైదరాబాద్‌తో మెదక్‌ను రైలుమార్గం ద్వారా కలపాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. పొరుగునే ఉన్నప్పటికీ మెదక్‌ వాసులు భాగ్యనగరానికి రావాలంటే రోడ్డు మార్గమే దిక్కు. అందుకే, ఈ ప్రాంతాభివృద్ధికి కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలు 2012–13లో 17.2 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రైల్వే లైన్‌ ప్రాజెక్టును చేపట్టాయి. తొలుత రూ.117.72 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించాయి. ఇందులో తెలంగాణ 50 శాతం, కేంద్రం 50 శాతం ఖర్చును భరించాయి. ఇందుకోసం కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి భారతీయ రైల్వేకు అప్పగించింది. తర్వాత అక్కన్నపేట–మెదక్‌ రైల్వే మార్గానికి 2014–15 నుంచి 2018–19 వరకు రూ.169 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిగితే.. ఒక్క 2018–19లోనే రూ.122.27కోట్లు కేటాయించారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా లక్ష్మాపూర్, షమ్నాపూర్, మెదక్‌ల్లో మొత్తం 3 నూతన రైల్వే స్టేషన్లు, 3 మేజర్‌ వంతెనలు, 1 ఆర్వోబీ, 35 మైనర్‌ బ్రిడ్జీలు, 15 ఆర్‌యూబీలను నిర్మించారు. 

మరిన్ని వార్తలు