కరువు కోరల్లోనే..

8 Sep, 2014 02:18 IST|Sakshi
కరువు కోరల్లోనే..

- 70శాతం చెరువుల్లో నీరు కరువు
- 24శాతం అంతంత మాత్రమే
- పూర్తిగా నిండింది 6.20శాతమే
-  భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం
- పరిస్థితి ఇలాగే ఉంటే రబీ పంటలకు కష్టమే
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరువు కొట్టుమిట్టాడుతోంది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలు కేవలం భూమి తడపడానికి, మెట్ట పంటలకు ప్రాణం పోయడానికే సరిపోయింది. చెరువుల్లోకి పెద్దగా నీళ్లు వచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువే. జిల్లాలోని సుమారు 70శాతం చెరువులు నీళ్లులేక బోసిపోయాయి. దీంతో చెరువులనే ఆధారం చేసుకొని ఖరీప్‌లో సాగు చేస్తున్న వరిపైరు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రబీ పంటపై పూర్తిగా ఆశలు వదుకోవాల్సిందే. జిల్లా నుంచి కృష్ణానది పారుతున్నా ఇక్కడి పొలాలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు.

కేవలం రెండు, మూడు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలకు మాత్రమే నీరు అందుతోంది. జిల్లాలోని దాదాపు 55మండలాలు కేవలం చెరువులు, కుంటల ఆధారంగానే పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో చెరువులను మూడు డివిజన్లుగా విభజించారు. వాటి పరిధిలో మొత్తం 6,055 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (40హెక్టార్లలో విస్తరించినవి) 681 ఉన్నాయి. వీటి కింద 60,456 హెక్టార్లు సాగవుతోంది. చిన్న చెరువులు 5,374 దాకా ఉన్నాయి. వీటి కింద 41,732 హెక్టార్ల పంట సాగవుతోంది. అయితే ఈ ఏడాది చెరువుల్లోకి పెద్దగా నీరు రాకపోవడంతో అవి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వరి పంట పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
 
సాగు అంతంతే..!
ఈ ఏడాది వర్షాలు దాగుడుమూతలు ఆడడంతో పంట సాగు అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో సరాసరిగా అన్ని పంటలు కలిపి 7,38,731.4 హెక్టార్లు సాగయ్యేది. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 5,16,266 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సాధారణంతో పోల్చితే దాదాపు 30శాతం పైగా సాగు తక్కువగా నమోదైంది. ఇక వరి విషయానికొస్తే అతి దారుణమైన గణాం కాలు నమోదయ్యాయి. జిల్లాలో వరి 1,09,459.8 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 33,557 హెక్టార్లు మా త్రమే సాగైంది. అది కూడా జూరాల, ఆర్డీఎస్ పరిధిలోని చోటుచేసుకున్న గణాంకాలే సూచిస్తున్నాయి. అయితే ఈ సారి చిన్న, పెద్ద చెరువులేవీ పూర్తిస్థాయిలో నిండలేదు.

దాదాపు 70శాతం వరకు ఖాళీగా దర్శనమిస్తున్నా యి. దీంతో ఈసారి వరి పంట కేవలం 33,557 హెక్టార్లలో మా త్రమే సాగైంది. వాస్తవానికి జిల్లాలో 1,09,459.8 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా కేవలం 30.65శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అది కూడా మున్ముందు సరైన వర్షా లు కురవకపోతే వాటి పరిస్థితి కూడా అంతే సంగతులు.
 
మహబూబ్‌నగర్ డివిజన్ కాస్త నయం
ఈ ఏడాది కురిసిన వర్షాలు కూడా అంతంత మాత్రమే. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలు మాత్రమే కాస్త ఉపసమనం కలిగించాయి. అయినప్పటికీ ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 28 శాతం లోటుంది. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గా వర్షాలు కురిశాయి. ఈ డివిజన్ పరిధిలో 302 పెద్దవి, 2183 చిన్న చెరువులున్నాయి. వీటిలో 15 పెద్ద చెరువులు, 329 చిన్న చెరువులు పూర్తిగా నిండాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ డివిజన్ పరిధిలో 46 చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్ పరిధిలో 157 పెద్దవి, 1,068 చిన్న చెరువులున్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 222 పెద్దవి, 2,123 చిన్న చెరువులున్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువు నిండలేదు.

మరిన్ని వార్తలు