'సెల్‌’మోహన రంగా

17 Jul, 2020 08:43 IST|Sakshi

సైబరాబాద్‌లో ఆరు నెలల్లో 7082 సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు

భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు

డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్‌ మాట్లాడొద్దంటున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: వాహనదారులు రోడ్లపై రయ్యుమంటూ దూసుకెళ్లడమే కాదు... డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ రింగ్‌ కాగానే రిసీవ్‌ చేసుకొని మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గడచిన ఆరు నెలల్లో 60కిపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే వాహనదారులు నిర్లక్ష్యం ఏ తీరులో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 272 వద్ద సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్న లారీడ్రైవర్‌ టర్నింగ్‌ చేసే సమయంలో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుద్దింది. లారీ ఆగకుండా ముందుకెళ్లడంతో టైర్ల కింద పడి ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటు చేసుకోవడంతో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్‌ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేయవద్దంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూనే... వివిధ ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ నిబంధనలపై వాహనదారులను జాగృతం చేస్తున్నారు.

6 నెలలు.. 7082 కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు 7082 సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేశారు. వివిధ ట్రాఫిక్‌ జంక్షన్లలో ఉన్న సీసీ టీవీ కెమెరాలతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు క్లిక్‌మనిపించిన కెమెరాలతో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తే రూ. వెయ్యి జరిమానాను ఈ–చలాన్‌ ద్వారా పంపిస్తున్నారు. ఇక పోలీసులు వివిధ సందర్భాల్లో నిర్వహించే స్పెషల్‌ డ్రైవ్‌లో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ దొరికితే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చార్జిషీట్‌ రూపొందించి కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఆయా కోర్టులు వారికి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రెండు రోజుల జైలు శిక్షను కూడా విధిస్తున్నాయి. ‘‘సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అది మీ ప్రాణాలకే కాదు ఎదుటివారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అత్యవరమైతే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముంది. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం’’ అని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు