కంటి ‘వెలుగు’ ఎప్పుడో? 

23 Dec, 2018 01:15 IST|Sakshi

7.32 లక్షల మంది బాధితుల ఎదురుచూపు 

ఎన్నికల సమయంలో పలుచోట్ల వికటించడంతో నిలిపివేత 

మళ్లీ ఆపరేషన్లు మొదలుపెట్టడంలో వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: ‘కంటి వెలుగు’ఆపరేషన్లపై నీలినీడలు అలుముకున్నాయి. కంటి శిబిరాలు నిర్వహించాక అవసరమైన వారందరికీ ఆపరేషన్లు చేస్తామని సర్కారు స్పష్టం చేసింది. మొదట్లో అక్కడక్కడ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు సమస్యలు తలెత్తడం, వరంగల్‌లో ఏకంగా 18 మందికి ఒకే ఆస్పత్రిలో ఆపరేషన్లు వికటించి పరిస్థితి విషమించడంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు కంగుతిన్నాయి. ఎన్నికల సమయంలో ఆపరేషన్లు వికటిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని గుర్తించి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్పట్లో ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎన్నికలు ముగిసి రెండు వారాలవుతున్నా.. మళ్లీ కంటి వెలుగు ఆపరేషన్లు మొదలుపెట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఎప్పటినుంచి కంటి ఆపరేషన్లు చేస్తారో కూడా ఇప్పటికీ అధికారులు వివరాలు వెల్లడించలేదు. దీంతో ఎప్పుడు ఆపరేషన్లు చేస్తారోనన్న ఆందోళన బాధితుల్లో నెలకొంది. 

7.32 లక్షల మంది ఎదురుచూపు.. 
ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.12 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 39.53 లక్షల (35.2%) మందికి ఏదో రకమైన కంటి లోపాలున్నట్లు గుర్తించారు. వారిలో 18.19 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు అందజేశారు. మరో 14.01 లక్షల మందికి చత్వారం ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో 3.47 లక్షల మందికి ఇప్పటివరకు చత్వారం అద్దాలు ఇచ్చారు. 7.32 లక్షల మంది లబ్ధిదారులకు ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో కొద్దిమందికి ఆపరేషన్లు వికటించినట్లు వార్తలు రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. 

ఆపరేషన్లు నాలుగింతలు పెరిగే అవకాశం... 
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కేవలం మూడు లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కంటి వెలుగు పూర్తయ్యే నాటికి 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని తాజా అంచనా. ఏకంగా 4 రెట్లు పెరగింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. అదనంగా మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వారందరికీ ఆయా ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి.  

ప్యాకేజీ పెంచాలంటున్న ప్రైవేటు ఆస్పత్రులు.. 
కంటి వెలుగు కింద క్యాటరాక్ట్‌ ఆపరేషన్లకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు కంటి ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒక్కో క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌కు రూ. 2 వేలు నిర్దారించారు. కొన్నింటికి గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆస్పత్రులకు చెల్లిస్తుంది. అయితే కంటి వెలుగు కింద గుర్తిస్తున్న వాటిలో అధికం క్యాటరాక్ట్‌వే ఉన్నాయి. క్యాటరాక్ట్‌ ఆపరేషన్లకు రూ. 2 వేలు ఇస్తే సరిపోదని, కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌లో క్యాటరాక్ట్‌కు రూ.6 వేలు ఇస్తున్నారని ప్రైవేట్‌ ఆస్పత్రులు అంటున్నాయి. తమకు కనీసం రూ.5 వేలయినా చెల్లించాలని కోరుతున్నాయి. లేదంటే ఆపరేషన్లు చేయబోమని చెబుతున్నాయి. ఈ సమస్యను ఇప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ పరిష్కరించలేదు.  

మరిన్ని వార్తలు