పట్టణాల నుంచి 75 శాతం జీడీపీ

30 Sep, 2014 03:21 IST|Sakshi
  • రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి  డాక్టర్ పి.కె.మహంతి
  • రాయదుర్గం: పట్టణాలు, నగరాల నుంచి 2030 నాటికి జీడీపీలో 75 శాతం వస్తుందని అంచనాలు చెబుతున్నాయని, పట్టణ ప్రాంతాలను ఆ స్థాయిలో అభివృద్ధి పరచాల్సిన అవసరాన్ని గుర్తించాలని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మెట్రో పొలిస్ సదస్సును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అర్బన్ ఫైనాన్స్‌పై ప్రీ కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన ప్రసంగించారు.

    మన దేశంలో 62 శాతం జాతీయ ఆదాయం పట్టణ ప్రాంతాల నుంచే వస్తోందని ఇటీవ ల అహ్లూవాలియా కమిటీ తన నివేదికలో పేర్కొన్నదని గుర్తు చేశారు. పట్ణణ ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధులు, వసూలు చేస్తున్న పన్నులపై మరింత పరిశోధన  అవసరం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వృత్తి పన్ను వసూలును గ్రేటర్ హైదరాబాద్‌కు ఇవ్వాలని, అలా చేస్తే మొదటి ఏడాదిలోనే నాలుగింతలు వసూలు చేసి చూపిస్తామని అర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు.

    వాహనాల పన్నును ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తోందని తెలిపారు. ఏడాదికి రూ.100 కోట్లు వసూలవుతున్నాయని చెప్పారు. గ్రేటర్‌కు కేటాయిస్తే మొదటి ఏడాదే రూ.500 కోట్లు వసూలు చేసి చూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.  గత ఏడాది  గత ఏడాది రూ. 747 కోట్లు ఆస్తిపన్ను వసూలు కాగా ప్రస్తుతం రూ.1023 కోట్లు వసూలు చేశామని తెలిపారు.
     
    హైదరాబాద్‌కే అవకాశం

    మెట్రో పొలిస్ సదస్సు నిర్వహణకు జోహెన్నెస్‌బర్గ్ నగరం పోటీకి వచ్చినా హైదరాబాద్‌కే అవకాశం దక్కిందని స్పెషల్ కమిషనర్ ఎ.బాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలలోని 136 పట్టణాలకు చెందిన 1900 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారన్నారు.

    380 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉంటారని తెలిపారు. అక్టోబర్ 6 నుంచి 9 వరకు మెట్రో పోలిస్ సదస్సులో చర్చలు సాగుతాయని చెప్పారు. 10న ఔటర్ రింగు రోడ్డు, ఐటీ కారిడార్ తదితర ప్రాంతాలలో క్షేత్ర పర్యటన ఉంటుందన్నారు. సదస్సులో భాగంగా వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. ‘షహర్ నామా’ పేరిట జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో పట్టణ సమస్యలపై రూపొందించిన 40 సినిమాలు ప్రదర్శిస్తారని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో భార త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, రాజేంద్ర పచోరి వంటి ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. 100 స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసే అంశంపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్ కె.రామకృష్ణారావు, అదనపు డీజీ డాక్టర్ బి.గంగయ్య, డెరైక్టర్లు వి.శ్రీనివాసాచారి, షబ్బీర్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు