వీఆర్వో పరీక్షకు 78 శాతం హాజరు

17 Sep, 2018 04:05 IST|Sakshi

7.87 లక్షల మంది పరీక్ష రాశారు: టీఎస్‌పీఎస్సీ 

ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాల కేటాయింపు 

కొందరికి పరీక్ష కేంద్రాలు మారినట్లు మెసేజ్‌లు 

హాల్‌టికెట్‌లో మాత్రం పాత కేంద్రం పేరు 

మారిన కేంద్రం వద్ద అనుమతి నిరాకరణ 

మహిళలను తాళి తీయించి అనుమతించిన సిబ్బంది 

సాక్షి, హైదరాబాద్‌: విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో) పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 78.46 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 700 పోస్టుల భర్తీకి జరిగిన ఈ పరీక్షకు 10,58,387 మంది దరఖాస్తు చేసుకోగా 7,87,049 మంది పరీక్ష రాశారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. వరంగల్‌ అర్బన్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా 83 శాతం మంది, వికారాబాద్‌ జిల్లాలో అతి తక్కువగా 29 శాతం మంది హాజరయ్యారని వెల్లడించింది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌ జిల్లాలో 73,681 మంది (74.06 శాతం), రంగారెడ్డి జిల్లాలో 64,209 మంది (74.89 శాతం), మేడ్చల్‌లో 68,499 మంది (75.09 శాతం) పరీక్ష రాశారు.  

ఇష్టం వచ్చినట్లు కేంద్రాల కేటాయింపు 
దరఖాస్తు సమయంలో ఎంచుకున్న జిల్లాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన కొంతమందికి ఆదిలాబాద్‌ వంటి జిల్లాల్లో కేటాయించడంతో పరీక్షకు హాజరు కాలేకపోయారు. హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు సామర్థ్యానికి మించి అభ్యర్థులు ఆప్షన్‌ ఇవ్వడంతో అనేక మందికి ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించారు.  

పరీక్ష కేంద్రం మారిందంటూ.. 
పరీక్ష సందర్భంగా కొన్ని చోట్ల అభ్యర్థులు తంటాలు పడాల్సి వచ్చింది. కొందరికి ‘మీ పరీక్ష కేంద్రం మారింది.. మారిన ప్రకారం హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి’అని సమాచారం రావడంతో గందరగోళం నెలకొంది. 1340077047 నంబరు గల అభ్యర్థి రెండు రోజుల కిందట హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే ‘మీ పరీక్ష కేంద్రం మారింది.. మారిన ప్రకారం హాల్‌టికెట్‌ ఇంకా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఒకవేళ డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఈ మెసేజ్‌ను వదిలేయండి’అని శనివారం మధ్యాహ్నం 12:20 గంటలకు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మళ్లీ మధాహ్నం 1.09 గంటలకు.. ‘మీకు ముందుగా ఇచ్చిన పరీక్ష కేంద్రాన్ని (విజేత స్కూల్‌ తుర్కపల్లి, శామీర్‌పేట్‌ మండలం) మార్పు చేశాం.. మూసారాంబాగ్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీ ఫర్‌ గరŠల్స్‌ కేంద్రాన్ని కేటాయించాం.. మారిన కేంద్రం ప్రకారం హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి..’అని సమాచారం వచ్చింది. కానీ ఆ అభ్యర్థి ఎన్నిసార్లు డౌన్‌లోడ్‌ చేసినా తుర్కపల్లి పరీక్ష కేంద్రం ఉన్న హాల్‌టికెటే వచ్చింది. దీనిపై టీఎస్‌పీఎస్సీ టెక్నికల్‌ టీం, హెల్ప్‌ డెస్క్‌కు అనేకసార్లు ఫోన్‌ చేసినా కలవలేదు. కలసినా ఫోన్‌ తీయలేదు. దీంతో సదరు అభ్యర్థి మారిన కేంద్రానికి వెళ్లగా అక్కడ తన నంబరు లేదు. తనలా చాలా మంది ఉండొచ్చని సదరు అభ్యర్థి అన్నారు. 

తాళి తీయించి పరీక్షకు..
తనిఖీల పేరుతో పలు కేంద్రాల్లోని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా అభ్యర్థుల వాచ్‌లు, గాజులు.. చివరకు మెడలోని తాళినీ తీయించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో మహిళలను తాళి తీసేసిన తర్వాతే పరీక్షకు అనుమతించడంతో అభ్యర్థుల బంధువులు కేంద్రం ఎదుట తాళిబొట్లు పట్టుకుని నిరసనకు దిగారు. పోలీసుల జోక్యంతో తాళి, మెట్టెలతో హాలులోకి అనుమతించారు. అనేక మంది మహిళలు చంటి బిడ్డలతో పరీక్షకు హాజరయ్యారు. కేంద్రాల ముందు కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడంతో మధ్యాహ్నమంతా చిన్నారులను ఎత్తుకుని ఎండలోనే గడపాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు