వేగం వద్దు.. ప్రాణం ముద్దు

3 Jul, 2019 07:19 IST|Sakshi

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 79 బ్లాక్‌స్పాట్‌లు

ఆర్‌సీపురం, చందానగర్‌ మార్గంలో అత్యధిక ప్రమాదాలు

తర్వాత స్థానంలో మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి

రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లిలోనూ అంతే..  

వర్షాకాలంలో జాగ్రత్త అవసరమంటున్న ట్రాఫిక్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపై దూసుకెళ్లే వాహనదారులు అతివిశ్వాసానికి పోయి వాహనాల వేగం పెంచొద్దంటున్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఎప్పుడూ వెళ్లే రోడ్డే కదా.. నాకేం అవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దని.. ముఖ్యంగా వర్షాకాలంలో వాహన వేగానికి కళ్లెం వేయకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది జరిగిన 79 రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఆర్‌సీపురం నుంచి చందానగర్‌ మార్గంలో 21 ప్రమాదాలు జరిగాయని, ఈ రూట్‌లో వెళ్లే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. జాతీయ రహదారి 65 మార్గంలోని శేరిలింగంపల్లి ఎంఐజీ కాలనీ పోచమ్మ గుడి నుంచి లింగంపల్లిలోని గాంధీ విగ్రహం వరకు ఈ ఏడాది 21 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మియాపూర్‌లోని సౌతిండియా షాపింగ్‌ మాల్‌ నుంచి సినీటౌన్‌ సమీపంలోని దుర్గమ్మ గుడి మార్గంలో 15 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కూకట్‌పల్లి వైజంక్షన్‌ నుంచి మూసాపేట మార్గంలో 14 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక జాతీయ రహదారి 765 మార్గంలోని రాజేంద్రనగర్‌కు సమీపంలోని ఆరాంఘర్‌ ఎక్స్‌ రోడ్డు పిల్లర్‌ నంబర్‌ 314 నుంచి కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వరకు 13 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక మాదాపూర్‌లోని అంతర్గత రహదారిలో మాదాపూర్‌ ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి బెంజ్‌ షోరూం యూటర్న్‌ వరకు 16 రోడ్డు ప్రమాదాలు జరిగి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రెండో స్థానంలో నిలిచింది.

ప్రమాదాలకు కారణాలివే..
ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడంపై ఇటు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, అటు జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు అధ్యయనం చేశారు. రోడ్లు ఇరుకుగా ఉండటం, యూటర్న్‌లు ఉండటం, రహదారి ఇంజినీరింగ్‌ పనుల్లో లోపాలతో పాటు వాహనదారుల అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ కూడా చాలా మంది ప్రాణాలు తీస్తోందని గుర్తించారు. ఓవైపు వాహనదారులకు డ్రైవింగ్‌పై అవగాహన కలిగిస్తూనే.. మరోవైపు వర్షాకాలం సమీపించడంతో ఆ 79 బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇతర ప్రభుత్వ విభాగాల సహకారంతో మరమ్మతులు చేపడుతున్నారు. ఏది ఏమైనా ఆ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. 

ఐదేళ్లుగా 700 బ్లాక్‌స్పాట్‌లు
సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ కమిషనరేట్‌ పరిధిలో బ్లాక్‌స్పాట్‌లపై అధ్యయనం చేశారు. 2015లో 110, 2016లో 130, 2017లో 187, 2018లో 194, 2019లో 79 బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించారు. ఈ సంవత్సరాల్లో ఎక్కువగా రాజేంద్రనగర్‌లోని అరాంఘర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి డైమండ్‌ కంట, బాబుల్‌రెడ్డి నగర్, హైదరగూడ నుంచి అత్తాపూర్, ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నంబర్‌ 190 నుంచి 226, అరాంఘర్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ నుంచి సూర్య ధాబా, అరాంఘర్‌ ఎక్స్‌ రోడ్డు పిల్లర్‌ నంబర్‌ 314 నుంచి కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మార్గంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాటిని బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. తర్వాత స్థానాల్లో ఆర్‌సీపురం, కేపీహెచ్‌బీ, మియాపూర్, బాలానగర్, మాదాపూర్‌ ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 700 బ్లాక్‌స్పాట్‌ను ప్రకటించి అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టారు.  

డ్రైవింగ్‌లో అప్రమత్తత తప్పనిసరి  
వర్షాకాలం కావడంతో రహదారులపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎదురుగా వచ్చే ప్రాంతాలను బట్టి ముఖ్యంగా బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాల్లో నిదానంగా ముందుకెళ్లాలి. అతివేగంతో వెళితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవచ్చు. ఆయా ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి బాగా లేకపోవడంతో జాగ్రత్తగా వెళ్లాలి. కుటుంబ సభ్యులకు మాత్రం శోకం మిగల్చవద్దు.  – వీసీ సజ్జనార్,సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు