కరోనా బ్రేకింగ్‌: గాంధీలో 8 మంది అనుమానితులు!

3 Mar, 2020 10:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(24)కి కరోనా పాజిటివ్‌ ఫలితాలు రావడంతో సర్కారు అప్రమత్తమైంది. అతన్ని గాంధీలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. తాజాగా, మరో ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. వారంతా ఇటలీ, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌కు వెళ్లొచ్చినట్టు తెలిసింది. ఇదిలాఉండగా.. వైరస్‌ బారినపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి తొలుత చికిత్స అందించిన సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రి సిబ్బంది కూడా గాంధీకి క్యూ కట్టారు. వారికి కరోనా నిర్ధారిత పరీక్షలు జరుగుతున్నాయి.
(చదవండి: ఓ మై గాడ్‌.. కోవిడ్‌.. ఆస్పత్రిలో సునితా)

ఇక కరోనా కలకలం నేపథ్యంలో వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, అధికారులు రఘునందన్‌రావు, యోగితారాణి, శాంతకుమారి, దానకిషోర్‌, లోకేష్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు చర్చించనున్నారు.
(చదవండి :శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనాఅలర్ట్‌)

ఇవీ కోవిడ్‌ లక్షణాలు...
జ్వరం, అలసట, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కోవిడ్‌ సాధారణ లక్షణాలు. గొంతునొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు 20% కేసులలో కనిపిస్తాయి. చైనా వైద్య ఆరోగ్యశాఖ అంచ నా ప్రకారం ఇటువంటి లక్షణాల్లో 81% కేసులు తేలికపాటివి, 14 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఉం టుంది. 5 శాతం మందికి వెంటిలేటర్‌ లేదా క్లిష్టమైన సంరక్షణ నిర్వహణ చర్యలు అవసరం. కోవిడ్‌ లక్షణాలు 2 నుంచి 14 రోజుల్లో బయటపడతాయి. శ్వాసకోశ స్రావాల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే బిందువుల ద్వారా .. కలుషితమైన వస్తువులు, దగ్గరి పరిచయాల ద్వారా పరోక్షంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.  
(ప్రపంచ ఎకానమీకి వైరస్‌ ముప్పు!)

మరిన్ని వార్తలు