రక్తమోడిన రహదారులు

5 Oct, 2019 02:18 IST|Sakshi

రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం

మరో 8 మందికి తీవ్రగాయాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఘటన

దేవరుప్పుల/పరకాల/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలు ఉమ్మడి వరంగల్‌ జిల్లా దేవరుప్పల మండలంలో..ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ సమీపంలో జరిగాయి.

శుభకార్యానికి వెళ్తుండగా.. 
జనగామ వీవర్స్‌కాలనీకి చెందిన బోగ సోమనర్సయ్య(40), ఆయన మేనల్లుడు చింతకింది మణిదీప్‌ (18) మరో నలుగురు బంధువులతో కలిసి శుభకార్యానికి వెళుతూ దేవరుప్పుల మండలం బంజర స్టేజీ సమీపాన రోడ్డు దాటుతున్న వృద్ధుడిని తప్పించబోయి ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టారు. మణిదీప్‌ మృతి చెందగా.. సోమ నర్సయ్యతోపాటు ఎదుటి కారులో ప్రయాణిస్తున్న కొమ్ము కృష్ణ (32), వర్రె మహేష్‌ (24) గాయపడ్డారు. అక్కడ చికిత్స పొందుతూ సోమనర్సయ్య, కృష్ణ దుర్మరణం చెందగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మహేశ్‌ సాయంత్రం మృతి చెందాడు.

అదుపుతప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టి..
వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన చెందిన బోనోతు సోనాల్‌నాయక్‌ (35) పండుగ కోసం భార్యా పిల్లలతో కలసి హన్మకొండలోని తండ్రి ఇంటికి ఓ ప్రైవేటు వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న వాహనం కుడివైపు టైర్‌ పంచర్‌ కావడంతో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో సోనాల్‌నాయక్, ఆయన భార్య రజిత (30), 4 నెలల బాబుతోపాటు మంగ పేట మండలం కమలాపూర్‌ గ్రామానికి చెందిన దాసుపల్లి అశ్విన్‌ (23) అక్కడికక్కడే మృతి చెందారు. సోనాల్‌ నాయక్, రజితకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఝాన్సీని  దస రా సెలవులు కావడంతో 3 రోజుల క్రితమే సోనాల్‌నాయక్‌ తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు.

మరిన్ని వార్తలు