80 వేల మంది ఖాతాల్లో.. రూ.258.44 కోట్లు జమ

2 May, 2020 03:39 IST|Sakshi

పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకున్న ఉద్యోగులు 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులు తమ భవిష్యనిధి (పీఎఫ్‌) ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించగా... ఇప్పటివరకు రాష్ట్రంలో 80వేల మంది సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో అధికంగా ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాల జీ) ఇంజనీర్లే ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందు కు దేశవ్యాప్తంగా మార్చి 24వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది.ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు వారి పీఎఫ్‌ ఖాతా నుంచి మూడు నెలల వేతనం మేర విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80,647 మంది ఉద్యోగులు పీఎఫ్‌ నుంచి నగదు ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.వీటిని మూడు రోజుల్లో పరిష్కరించిన భవిష్యనిధి కార్యాలయ అధికారులు...దాదాపు 98% మేర దరఖాస్తులను పరిష్కరించారు. వారి ఖాతాల్లో రూ.258.44 కోట్లు జమ చేసినట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్లు విపిన్‌ కుమార్, చంద్రశేఖర్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కోవిడ్‌–19తో సంబంధం లేకుండా వచ్చిన మరో 49,755 దరఖాస్తులను సైతం పరిష్కరించినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై) కింద రాష్ట్రంలో 4,805 ఎస్టాబ్లిష్‌మెంట్లు అర్హత సాధించాయన్నారు.వీటికి కంపెనీ చందా కింద కట్టాల్సిన రూ.9.24 కోట్లు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు