వచ్చే ఏడాది 87 వేల ఉద్యోగాలు

24 Nov, 2017 01:37 IST|Sakshi

ఇప్పటి వరకు 24 వేల పోస్టులు భర్తీ చేశాం: హరీశ్‌రావు  

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.25 లక్షల గ్రాంటు

సాక్షి, సిద్దిపేట: నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చే ఏడాది 87 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం సిద్దిపేటలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో ఇప్పటి వరకు 24 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. మిగిలిన 87 వేల ఉద్యోగాలను వచ్చే ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు.

ప్రతిభ ఉండి విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు పడేవారని, వారి కోసం రూ.25 లక్షల గ్రాంటును అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు తలెత్తుకుని బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం మెరుగైన వసతులు కల్పిçస్తూ రెసిడెన్సియల్‌ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 120 ఎస్సీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మూడేళ్లలోనే రెట్టింపుగా మరో 124 ఎస్సీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. 25 ఎస్సీ, 25 ఎస్టీ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి తెలంగాణ బిడ్డలు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్, ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు