వాంతులు అవుతున్నాయని...

18 Oct, 2017 12:11 IST|Sakshi

ఉపాధ్యాయులకు చెప్పి బయటకొచ్చిన ప్రియాంక

మరునాడు మృతదేహమై కనిపించిన ఎనిమిదో తరగతి విద్యార్థిని

 బ్యాగ్‌లో సూసైడ్‌నోట్‌ లభ్యం

మహబూబ్ నగర్ జిల్లా : ‘సార్‌ నాకు వాంతి వస్తోంది.. బయటికి వెళ్తాను సార్‌’ అని చెప్పి సోమవారం పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రియాంక(14) మంగళవారం మృతదేహమై కనిపించింది. హన్వాడ మండలం పెద్దర్పల్లి గ్రామం గొల్లగడ్డ కాలనీకి చెందిన అడవిగొల్ల మల్లేష్‌ – లక్ష్మమ్మ ఏకైక కూతురు ప్రియాంక మండల కేంద్రం లోని శ్రీవిద్యా విజ్ఞాన్‌ మందిర్‌లో 8వ తరగతి చదువుతోంది. చదువులో చురుకుగా ఉండే ప్రియాంక ను సాటి విద్యార్థులు సూటిపోటి మాటలతో వేధిస్తు న్నట్లు చెబుతున్నారు.

 ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తమ్ముడితో కలిసి పాఠశాలకు వెళ్లిన ఆమె 9:20గంటల ప్రాంతంలో క్లాస్‌ టీచర్‌ అనుమతితో బయటికి వచ్చింది. అలా వచ్చిన ప్రియాంకను ఎంతకూ తరగతి గదికి రాలేదని ఎవరూ గుర్తించ లేకపోయారు. వాంతులు అవుతున్నాయని ఆమె చెప్పినప్పటికీ తోటి విద్యార్థుల సహకారం లేకుండా బయటికి పంపించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని గ్రామస్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

మోత్కుకుంటలో మృతదేహం
ప్రియాంక ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు సోమవారం మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక మంగళవారం సాయంత్రం గ్రామస్తులకు గ్రామ శివారు మోత్కుకుంటలో మృతదేహం కనిపించింది. పరిశీలించగా ప్రియాంకది అని తేలడంతో బంధువు లు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి బ్యాగ్‌ను పరిశీలించగా అందులో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో ‘నా చావుకు కారణం తరగతి గదిలోని విద్యార్థులు కాబట్టి నా కోసం వెతక వద్దు, ఉంటాను...’ అని ఉండగా పోలీసులకు ఫిర్యా దు చేశారు. కాగా, చదువులో చురుకుగా ఉండే ప్రియాంకతో తోటి విద్యార్థుల నుంచి ఎప్పుడూ తగ వులు, వేధింపులు  ఎదురవుతున్నాయని చెబుతున్నా రు. అయితే, ఇవన్నీ పాఠశాల యాజమాన్యం దృష్టికి వెళ్లలేదా, వెళ్లినా పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ పోలీసుల విచారణలో బయట పడుతాయని భావిస్తున్నారు.

తండ్రికి సమాచారమిచ్చాం..
ప్రియాంకకు వాంతులు అవుతున్నాయని చెప్పి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం 12గంటల వరకు కూడా రాకపోవడంతో ఆమె తండ్రికి ఫోన్‌లో సమాచారమివ్వగా సాయంత్రం వచ్చి ఆరా తీశారు. అలాగే, ఆమె బ్యాగ్‌ తీసుకువెళ్లారు. ఆమెను మిగతా విద్యార్థులెవరూ వేధించలేదు. – రాజీవ్‌గౌడ్, హెచ్‌ఎం, శ్రీవిద్యా విజ్ఞాన్‌ మందిర్‌

మరిన్ని వార్తలు