అంకె మారింది. ఎనిమిది కాదు.. తొమ్మిది!

17 Dec, 2017 13:20 IST|Sakshi

మేళ్లమడుగు ఎన్‌కౌంటర్‌ మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ తొమ్మిదో మృతదేహం.. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చింది.. మరెన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తుపాకీ తూటాలు సాగించిన ఈ నరమేధం.. పోలీసులు చెబుతున్నట్టుగా ఎన్‌కౌంటరేనా..? కొందరు ఆరోపిస్తున్నట్టుగా బూటకమా..?
పొదల్లో ఈ మృతదేహం ఎందుకుంది..? ఎన్‌కౌంటర్‌ నిజమేననడానికి ఇది నిదర్శనమా..? ‘పోలీసులే పొదల్లో పడేశార’న్నది వాస్తవమా..? ఎన్‌కౌంటరా..? హత్యలా..? ఈ ప్రశ్నలకు జవాబులేవి..??!! 

ఇల్లెందు: ఇల్లెందు సబ్‌ డివిజన్‌ టేకులపల్లి మండలం మేళ్లమడుగులో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ‘సీపీఐ(ఎంఎల్‌) సీపీ బాట’ అజ్ఞాత దళం సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆ రోజున ఎనిమిదిమంది చనిపోయారని పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిగిన ప్రదేశంగా పోలీసులు చెప్పిన స్థలానికి కొద్ది దూరంలోగల చెట్ల పొదల నుంచి మరో మృతదేహాన్ని పోలీసులే శనివారం స్వాధీనపర్చుకున్నారు. రాచకొండ కిరణ్‌ అలియాస్‌ కార్తీక్‌గా గుర్తించారు. 

ఎవరీ కిరణ్‌ అలియాస్‌ కార్తీక్‌..? 
మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రాచకొండ వీరన్న–కౌసల్య దంపతుల కుమారుడే కిరణ్‌ అలియాస్‌ కార్తీక్‌. ఇతని వయసు 30 ఏళ్ల లోపు ఉంటుంది. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందాడు. తల్లి, అక్క లావణ్య, చెల్లి సౌజన్య ఉన్నారు. అక్కకు వివా«హమైంది. చెల్లి, డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఇంటివద్దనే ఉంటోంది. ఇతడు దాదాపుగా పదేళ్ల నుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇన్నేళ్లలో ఒకే ఒక్కసారి మాత్రమే తన ఇంటికి వెళ్లాడు. ఉమ్మడి న్యూడెమోక్రసీలో ఏడెనిమిది సంవత్సరాలపాటు పనిచేశాడు. న్యూడెమోక్రసీలో చీలికకు ముందు ఇతడు పాల్వంచ ఏరియా విజయ్, రాము దళాల్లో పనిచేశాడు. పార్టీలో చీలిక తరువాత చంద్రన్న వర్గంలోని రాము దళంలోకి వెళ్లాడు. ఆరు నెలల క్రితం వరకు ఇందులోనే ఉన్నాడు.

 ఈ దళం సభ్యురాలైన సుమలత అలియాస్‌ గీతను పెళ్లి చేసుకున్నాడు (అప్పటికి వీరిద్దరూ ఇదే దళంలో సభ్యులుగా ఉన్నారు). గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తన పుట్టింటికి వెళ్లింది. బాబు జన్మించిన తరువాత నుంచి దళం వైపు తిరిగి రాలేదు. కిరణ్‌ అలియాస్‌ కార్తీక్‌ మాత్రం అప్పుడప్పుడు తన భార్య వద్దకు వెళ్లి రెండు మూడు రోజుల వరకు ఉండేవాడు. అతడు క్రమంగా మద్యానికి బానిసగా మారాడు. ఈ నేపథ్యంలో, అతడిని రాము దళం దూరంగా పెట్టింది. అప్పటి నుంచి ఇతడు పాల్వంచ వద్దనే కుటుంబంతో నివాసముంటూ, పైపుల కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్వగ్రామంలోని స్నేహితుడు రషీద్‌ అలియాస్‌ విజయ్‌ (సీపీ బాట వ్యవస్థాపకుల్లో ఇతడు కూడా ఉన్నాడు) ద్వారా ఆరు నెలల క్రితం సీపీ బాటలో చేరాడు. మేళ్లమడుగులో ప్రాణాలు కోల్పోయాడు. 

పోలీసుల తీరుతో అనుమానాలు  
 మేళ్లమడుగు కాల్పుల ఘటన(ఎన్‌కౌంటర్‌) వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటి ఆధారంగానే, మొత్తం ఈ ఎన్‌కౌంటరే బూటకమని వాదిస్తున్నారు. ఆ అనుమానాలు ఇవీ... 

♦ గురువారం ఉదయం ఐదారు గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను మధ్యాహ్నం తరలించారు. అప్పటి వరకు ఆ ప్రదేశానికి ప్రజలనుగానీ, పార్టీల నాయకులనుగానీ, మీడియానుగానీ పోలీసులు అనుమతించలేదు. అక్కడ జరిగింది నిజంగా ఎన్‌కౌంటరే అయినట్టయితే.. ఇంత దాపరికం ఎందుకు? మీడియాను ఎందుకు అనుమతించలేదు..? 

♦ మృతదేహాలను ట్రాక్టర్‌లోకి చేర్చక ముందే.. దానికి (ట్రాక్టర్‌ ట్రక్కుకు) రక్తపు మరకలు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? (ప్రజాసంఘాలు, ఎన్డీ, పౌర–మానవ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానమిది). 

 ♦ సాధారణంగా ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు, అక్కడి నుంచి సుమారు కిలోమీటర్‌ దూరం వరకు పరిసర ప్రాంతాలకు స్థానికులను పోలీసులు పంపించి సోదా చేయిస్తారు. మేళ్లమడుగు ఘటన జరిగిన రోజున ఇలా చేయలేదు. కనీసంగా మీడియాను కూడా మధ్యాహ్నం వరకు అనుమతించలేదు. ఎందుకు..? 

 ‘అక్కడ జరిగింది ఎన్‌కౌంటరేనని నమ్మించేందుకే గుబురు పొదల్లో మృతదేహాన్ని పోలీసులే పడేశారా..?’ అని, ఎన్డీ నేతలు గుమ్మడి నర్సయ్య, మధు, సాధినేని వెంకటేశ్వరరావు తదితరులు ప్రశ్నిస్తున్నారు. ‘ఇది ఎన్‌కౌంటర్‌ కాదు. పోలీసులు చేసిన హత్యలు’ అని వారు గట్టిగా వాదిస్తున్నారు.

ఇవి దేనికి సంకేతాలు..? 
మొన్ననేమో ఎన్డీ అజ్ఞాత దళాల అగ్ర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్ననేమో మేళ్లమడుగు కాల్పుల్లో దళ సభ్యులు తొమ్మిదిమంది చనిపోయారు. ఈ పార్టీ – ఆ పార్టీ అనే తేడా లేకుండా మొత్తంగా సాయుధ (అజ్ఞాత) దళాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ‘తుపాకీ సంస్కృతి’ని తుదికంటా తొలగించేందుకు కంకణం కట్టుకుంది. ఇకపై మరింత కఠినంగా ఉంటామని చేతల్లో చూపుతోంది.

మరో మృతదేహం దొరికింది
టేకులపల్లి: టేకులపల్లి మండలం మేళ్ళమడుగు  అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ‘ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది ఎనిమిదిమంది కాదు.. తొమ్మిదిమంది’ అని పోలీసులు ప్రకటించారు. 

 ఎలా కనిపించిందంటే... 
గురువారం రోజంతా, కాల్పుల ప్రదేశం నుంచి మృతదేహాల తరలింపుతోనే పోలీసులకు సరిపోయింది. వాటిని గుర్తించడంతో, కుటుంబీకులకు అప్పగించడంతో శుక్రవారం గడిచింది. కాల్పుల స్థలాన్ని పునఃపరిశీలించేందుకు శనివారం అక్కడకు ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో టేకులపల్లి, గుండాల సీఐలు టి.రవి, దోమల రమేష్, టేకులపల్లి, బోడు ఎస్‌ఐలు అరుకల అనిల్, ఒడ్డేపల్లి మురళి, స్పెషల్‌ పార్టీ పోలీసులు వెళ్లారు. పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు సాగిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలోగల కోడెవాగు అవతలనున్న చెట్ల పొదల నుంచి దుర్వాసన వస్తుండడాన్ని పోలీసులు పసిగట్టారు. దగ్గరగా వెళ్లి చూసేసరికి మృతదేహం కనిపించింది. దగ్గరగా వెళ్లారు. ఒంటిపై జర్కిన్‌ ఉంది. లోపల ఖాకీ చొక్కా ధరించాడు. పక్కనే 8 ఎంఎం రైఫిల్‌తోపాటు బుల్లెట్లు కనిపించాయి. అక్కడే చిన్న నోట్‌ బుక్‌ కూడా ఉంది. దాని ఆధారంగా, అతడిని మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రాచకొండ కిరణ్‌ అలియాస్‌ కార్తీక్‌((28)గా గుర్తించారు. మృతదేహానికి అక్కడే టేకులపల్లి తహసీల్దార్‌ సరికొండ అంజంరాజు, డిప్యూటీ తహసీల్దార్‌ వీరభద్ర నాయక్, వీఆర్వో నాగమణి కలిసి పంచనామా నిర్వహించారు. ఆ తరువాత, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని  కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి  తరలించారు.  

 డీఎస్పీ ఏం చెప్పారంటే... 
ఈ తొమ్మిదో మృతదేహానికి సంబంధించి ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశ్‌రావు ఇలా ప్రకటించారు. ‘‘మేళ్ళమడుగు అటవీ ప్రాంతంలో గురువారం ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో కూంబింగ్‌ జరుగుతోంది. ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయేమోనని పరిశీలిచేందుకు ఆ అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాం. కోడెవాగు అవతల చెట్ల పొదల నుంచి దుర్వాసన వచ్చింది. వెళ్లి చూస్తే.. మృతదేహం కనిపించింది. పక్కన 8 ఎంఎం బుల్లెట్లు 50 రౌండ్లు, ఒక 8 ఎంఎం తుపాకీ, చిన్న నోట్‌బుక్‌ ఉన్నాయి. ఆ నోట్‌ బుక్‌ ఆధారంగా మృతదేహాన్ని సీపీఐ (ఎంఎల్‌) సీపీ బాట దళానికి చెందిన రాచకొండ కిరణ్‌ అలియాస్‌ కార్తీక్‌(28)గా గుర్తించాం’’.  

ఈ అరెస్టులు.. కాల్పులు..
నక్సల్స్‌ దళాలకు ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలు..!

మరిన్ని వార్తలు