9 నెలల గర్భంతో.. 5 కిలోమీటర్ల పరుగు

27 Apr, 2015 02:43 IST|Sakshi
9 నెలల గర్భంతో.. 5 కిలోమీటర్ల పరుగు

కరీంనగర్ స్పోర్ట్స్ : మిషన్ కాకతీయ పథకానికి మద్దతుగా ఐదు కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తారు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి కామారపు లక్ష్మి. ‘గర్భంలోని శిశువును కాపాడండి... గ్రామంలో చెరువులు కాపాడండి’ అనే నినాదంతో ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 30 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో 5 కిలోమీటర్లు పరుగెత్తారు. అంతకుముందు లక్ష్మి పరుగును జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సత్యవాణి, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యుడు గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. స్టేడియంలో 400 మీటర్ల ట్రాక్‌లో పన్నెండున్నర రౌండ్లు లక్ష్మి అలవోకగా పరుగెత్తి అందరినీ అబ్బురపర్చింది. అనంతరం తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విజయభాస్కర్, రమేశ్ ఆమెకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఆదివారం పూర్తిచేసిన పరుగుపందెం రికార్డును గిన్నిస్ బుక్‌లో చోటు కోసం పంపనున్నట్లు వెల్లడించారు. గతంలో మారథాన్ పరుగును కెనడా దేశానికి చెందిన అమీ 6 గంటల 12 నిమిషాల్లో పూర్తి చేశారని.. 9 నెలల గర్భిణి ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదని వారు చెప్పారు.
 
 గర్భిణుల్లో స్ఫూర్తి నింపడానికే: లక్ష్మి
 గర్భం దాల్చిన తర్వాతకాలు కదపకుండా విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, గర్భిణులకు వ్యాయమం తప్పని సరి. దీంతో పుట్టబోయే పాపకు సరైన ఆక్సిజన్ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో పాటు సుఖ ప్రసవం జరుగుతుంది అని తెలియజేయడంతో పాటు.. మహిళల్లో స్ఫూర్తి నింపడానికే ఈ సాహసం చేశా.. రికార్డు సాధించడం ఆనందంగా ఉంది.

మరిన్ని వార్తలు