'పండగ' చేస్కో!

13 Oct, 2018 02:59 IST|Sakshi

దసరా.. దీపావళి వేళ ఆన్‌లైన్‌ సేల్స్‌ అదుర్స్‌ 

90 శాతం యువత ఆన్‌లైన్‌ సేల్స్‌కే మొగ్గు 

సాక్షి, హైదరాబాద్‌: పండుగ వస్తుందంటే చాలు ఆన్‌లైన్‌ ఆఫర్ల కోసం నగర యువత ఎదురుచూస్తోంది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు చేసిన తరువాతే కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద పండుగలైన దసరా.. దీపావళి.. ఆన్‌లైన్‌ సేల్స్‌ ఊపందుకున్నాయి. నచ్చిన వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడంలో గ్రేటర్‌ సిటిజన్లు ముందుంటున్నారు. స్మార్ట్‌ జనరేషన్‌గా మారుతోన్న యువత ఈ విషయంలో అగ్రభాగాన నిలుస్తున్నారు. ప్రధానంగా 18–35 వయసున్న వారు సుమారు 90 శాతం ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నట్లు అసోచామ్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఇక స్మార్ట్‌ఫోన్‌ వినియోగంతో ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని అసోచామ్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి అధ్యయన వివరాలను వెల్లడించింది. ఈసారి దేశవ్యాప్తంగా దసరా, దీపావళి సందర్భంగా సుమారు 15 మెట్రో నగరాల్లో ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సేల్స్‌ సుమారు 30 వేల కోట్ల మేర జరిగే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇక ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరగడానికి స్మార్ట్‌ఫోన్‌ వినియోగం, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్‌ అభిప్రాయపడింది.  

వీటిని కొనేందుకు ఆసక్తి... 
మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు, బ్రాండెడ్‌ షూస్, ఆభరణాలు, పెర్‌ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల ఆన్‌లైన్‌ కొనుగోలుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. వీటిల్లోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. పండుగ ఆఫర్స్, నిర్ణీత సమయాల్లో బుక్‌చేస్తే భారీ తగ్గింపు ధరలు, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లు, ధమాకా సేల్స్‌తో సుమారు 20 ఈ కామర్స్‌ సంస్థల సైట్లకు ఈసారి వ్యాపార సేల్స్‌ పంట పండించే అవకాశం ఉందని వెల్లడించింది. 

ఈ మెట్రో నగరాల్లో ఈ–కామర్స్‌ ఫుల్‌... 
దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలతోపాటు అహ్మదాబాద్, పుణే, గుర్‌గావ్, నోయిడా, చండీగఢ్, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఈ–కామర్స్‌ జోరు కనిపిస్తోందని పేర్కొంది. ఈ మెట్రో నగరాల్లోనూ ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.  

పురుషులే అధికం.. : ఈ అధ్యయనం ప్రకారం.. ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో పురుషులదే పైచేయి అని తేలింది. వీరి వాటా 65 శాతం ఉండగా.. స్త్రీలు 35 శాతం మంది ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక పండుగ సీజన్‌లో 18–35 మధ్య వయసున్న స్త్రీ, పురుషులే అధిక భాగం ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేస్తున్నట్లు అంచనా వేసింది.

మరిన్ని వార్తలు