ఐదెకరాల్లోపు భూమి ఉన్న ఓసీలకూ 90 శాతం సబ్సిడీ

28 Jan, 2015 05:12 IST|Sakshi

సూక్ష్మసేద్యంపై ప్రభుత్వానికి ఉద్యానశాఖ ప్రతిపాదన  
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యంపై ఓసీలకు ఇస్తున్న సబ్సిడీని ఐదెకరాలలోపు భూమి ఉన్న వారికి 90 శాతం అమలు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.  ఉద్యానశాఖ ప్రదర్శన సభలో రైతులు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని నిలదీసిన సంగతి తెలిసిందే. తమలోనూ చిన్నసన్నకారు రైతులు ఉన్నందున ఐదెకరాల లోపున్న వారికి కూడా 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు.
 
 ఈ నేపథ్యంలో పోచారం ఆదేశాల మేరకు ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మంగళవారం ప్రతిపాదనలు తయారుచేసి పంపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ఉంది. నూతన ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఐదెకరాల లోపున్న ఓసీ రైతులకు 90 శాతం సబ్సిడీ అమలుకానుంది. ఐదెకరాలు మించిన వారికి మాత్రం యథావిధిగా 80 శాతం మాత్రమే సబ్సిడీ ఉంటుంది. 90  శాతం సబ్సిడీ వల్ల అదనంగా 20 వేల మంది రైతులకు ప్రయోజనం  కలగనుందని  వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు