హరితహారం చెట్లపై హక్కు వారిదే!

26 Sep, 2017 00:41 IST|Sakshi

భూములు లేని ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకు పట్టా 

ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ స్థలాల్లో హరితహారం కింద నాటిన ఉద్యాన చెట్లపై భూములు లేని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర బడుగు వర్గాలకు హక్కు కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ స్థలాలు, సామాజిక భూములు తదితర చోట్ల అటవీకరణకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అనుసంధానంతో హరితహారం కింద మొక్కలు నాటుతోంది. వీటిపై పట్టా ఇచ్చి.. వచ్చే పండ్లు, కలప తదితర ఫలాలను అనుభవించేందుకు ఈ అవకాశం కల్పించింది. ఈ పథకాన్ని ఉపాధిహామీ కింద అమలుచేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అన్ని ప్రభుత్వ భూములను ఈ పథకం కింద నిర్ణీత వర్గాలకు చెందిన పేదలకు చెట్లపై పట్టా అందజేస్తారు.

ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారుల గుర్తింపు..
రోడ్లు, కాలువ పక్కన భూములు, ఇతర బీడు భూముల్లోని చెట్లపై సర్కార్‌ ఈ పథకం కింద లబ్ధిదారులకు పట్టా ఇవ్వనుంది. చెట్లపై పట్టా పొందాలంటే ఉపాధిహామీ పథకం కింద కనీసం 20 రోజులు గతేడాది లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనిచేసి ఉండాలి. లబ్ధిదారులను ఉపాధిహామీ పథకం సిబ్బంది గుర్తిస్తారు. అందుబాటులో ఉన్న భూమిని గుర్తించి లబ్ధిదారులకు వాటిని కేటాయించే బాధ్యత తీసుకుంటారు. లబ్ధిదారులు, భూముల గుర్తింపును గ్రామసభలో పెట్టి ఆమోదం తీసుకోవాలి. అనంతరం భూములు, లబ్ధిదారుల జాబితా తయారుచేస్తారు. ప్రతి ఏడాది మే నెలలో ఈ ప్రక్రియ కింద లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ చేపడతారు. 

>
మరిన్ని వార్తలు