నేడు మహా బతుకమ్మ వేడుకలు

26 Sep, 2017 07:17 IST|Sakshi

ఎల్బీ స్టేడియంకు 30 వేల మంది మహిళలు

28న సద్దుల బతుకమ్మ.. పాల్గొననున్న 3 వేల మంది

ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి తెలిపారు. ఈ నెల 26న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం జరుగు తుందని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది పది వేల మంది మహిళలతో ఇదే స్టేడియంలో నిర్వహించామన్నారు. ఈ ఏడాది 30 నుంచి 35 వేల మందితో ‘మహా బతుకమ్మను’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సా యంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆట–పాట కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. బతుకమ్మ పండుగ కోసం జిల్లాకు రూ. 3 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. టీఎస్‌టీడీసీ చైర్మన్‌ పేర్వారం రాములు మాట్లాడుతూ ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నందునా, ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రచారం జరిగి పర్యాటకులు పెరిగి రూ. కోట్లలో ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

28న సద్దుల బతుకమ్మ ...
ఈ నెల 28న సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నట్లు పర్యాటకం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. దీన్ని ఎల్బీ స్టేడియంలోనే నిర్వహిస్తామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జిల్లాలకు చెందిన 3 నుంచి 5 వేల మంది మహిళలు సద్దుల బతుకమ్మలతో పాల్గొని ఆట–పాట నిర్వహిస్తారని తెలిపారు. అనం తరం నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వ ర్యంలో మహిళలందరూ వెళ్లి హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈ సద్దుల బతుక మ్మను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కోసం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 28న గిన్నీస్‌ రికార్డు ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా ఛొంగ్తూ, సెర్ప్‌ సీఈవో పౌలోమిబసు పాల్గొన్నారు.

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
ఎల్బీ స్టేడియంలో  బతుకమ్మ ఉత్సవాలు జరగనుండటంతో ఆ ప్రాం తానికి వచ్చే మార్గాల్లో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
 
పార్కింగ్‌ ప్రాంతాలివే...
కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు అయ్యంకార్‌ భవన్‌ దిగాక నిజాం కాలేజీ గ్రౌండ్‌లో, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు బీజేఆర్‌ విగ్రహం వద్ద దిగాక ఎన్టీఆర్‌ స్టేడియంలో, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద దిగాక పబ్లిక్‌ గార్డెన్స్‌లో, వరంగల్‌ జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోని మహిళలు ఓల్డ్‌ పీసీఆర్‌లో దిగాక నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వాహనాలను పార్క్‌ చేయాలి. వీఐపీ వాహనాలను అలియా కాలేజీ, మహబూబియా కాలేజీల్లో పార్క్‌ చేయాలి. మంత్రుల వాహనాలను అలియా మోడల్‌ స్కూల్‌లో, మీడియా వాహనాలను ఎస్‌సీఈఆర్‌టీలో పార్క్‌ చేయాలి.   

ట్రాఫిక్‌ మళ్లింపు ప్రాంతాలివే..
- ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం వైపునకు అనుమతించారు. వీటిని కేఎల్‌కే బిల్డింగ్‌ ద్వారా నాంపల్లి లేదంటే రవీంద్రభారతి నుంచి మళ్లించనున్నారు. 
- అబిడ్స్, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపునకు అనుమతించనున్నారు. వీటిని గన్‌ఫౌండ్రీ వద్ద మళ్లించి చాపెల్‌ రోడ్డుకు మళ్లించనున్నారు.
- బషీర్‌బాగ్‌ నుంచి అబిడ్స్‌ జీపీవో వైపు వెళ్లే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వద్ద మళ్లించి హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా అనుమతించనున్నారు.
- ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌కు వెళ్లే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్‌ వద్ద మళ్లించి హిమాయత్‌నగర్‌ జంక్షన్‌వైపు అనుమతించనున్నారు. 
- కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్‌ వెళ్లే వాహనాలను కింగ్‌ కోఠి ఎక్స్‌రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌ వద్ద మళ్లించి తాజ్‌మహల్, ఈడెన్‌గార్డెన్‌కు అనుమతించనున్నారు. 
- లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ వద్ద మళ్లించి హిమాయత్‌నగర్‌ మీదుగా అనుమతివ్వనున్నారు.
- ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వచ్చే వాహనాలను నాంపల్లి రోడ్డు వద్ద మళ్లించనున్నారు. 

మరిన్ని వార్తలు