దేవుడి భూమిపై బడా నేత కన్ను!

26 Sep, 2017 02:02 IST|Sakshi

 సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్డులోని ఎకరం స్థలాన్ని చేజిక్కించుకునే వ్యూహం

ఆ స్థలంలో ఆవాసాలు వచ్చేలా చకచకా ఏర్పాట్లు

అది దేవాలయ భూమి కాదని చెప్పేలా అధికారులపై ఒత్తిళ్లు

‘ప్రక్షాళన’సందర్భంగా రికార్డులు మార్చేసేందుకు రంగం సిద్ధం!  

సాక్షి, హైదరాబాద్‌: అది దేవాదాయశాఖ పరిధిలో ఉన్న మఠం.. సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్డులో ఉన్న ఈ మఠానికి అనుబంధంగా దేవాలయం, దాదాపు ఎకరం ఖాళీ స్థలం ఉంది. అందులో పేదలు, ఇతర వ్యక్తులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడా స్థలంపై ఓ బడా నేత కన్ను పడింది. అందులో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చేసి.. అటు వారి ఓట్లను రాబట్టుకోవడం, ఇటు సొంత వ్యవహారాలకు వాడుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దేవాలయాల భూములను ఏ ఇతర అవసరాలకు కూడా కేటాయించకూడదన్న నిబంధన ఉండటంతో... అసలు అది దేవాలయ భూమి కాదని ఆ శాఖ అధికారులే తేల్చేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

‘తేల్చేందుకు’ రంగం సిద్ధం
సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్డులో ఉన్న మఠం పరిధిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. గతంలో దాతలు ఆ ఆలయానికి భూములను విరాళంగా ఇచ్చారు. అందులో మూడున్నర వేల గజాల స్థలం ఖాళీగా ఉండేది. అందులో కొందరు పేదలు, స్థానిక నేతల సహకారంతో కొంతమంది ఇతర వ్యక్తులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఓ బడా నేత తన ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఆ స్థలాన్ని బస్తీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ డబుల్‌ బెడ్రూం పథకం కింద ఇళ్లను నిర్మించి, పెద్ద సంఖ్యలో కుటుంబాలను అందులో చేర్చాలని చూస్తున్నారు. దీంతోపాటు కొంతమందికి పట్టాలిప్పించి ఇళ్లు నిర్మించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇక ఈ స్థలానికి సమీపంలో మరో దేవాలయానికి చెందిన వెయ్యి గజాల భూమి కూడా ఉంది. దానిని కూడా ఇదే తరహాలో మార్చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం కూడా దేవాలయ భూమిగా ఉంది. దాంతో ఆ భూమి తమది కాదంటూ దేవాదాయశాఖ పేర్కొనేలా ఓ ఉన్నతాధికారితో ‘ఒప్పందం’చేసుకున్నట్టు సమాచారం. ఆ అధికారి ఆ స్థలం దేవాలయభూమి కాదని ‘తేల్చేందుకు’ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుండటంతో.. అది దేవాలయ భూమి కాదని రికార్డుల్లో నమోదయ్యేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు