పెసర నాణ్యతాప్రమాణాలను సడలించాలి

26 Sep, 2017 02:03 IST|Sakshi

కేంద్రానికి మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: పెసర కొనుగోలులో నాణ్యతాప్రమా ణాలను సడలించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక లేఖ రాశారు. మార్క్‌ఫెడ్‌ ప్రతినిధి బాలకృష్ణను మంగళవారం ప్రత్యేకంగా ఢిల్లీకి పంపిస్తున్నారు. ఆ వివరాలను మార్కెటింగ్‌ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అవసరం లేని సమయంలో వర్షాలు పడటం, అవసరమున్నప్పుడు పడకపోవడం తదితర కారణాలతో పెసర గింజలో కాస్తంతా నాణ్యత దెబ్బతిన్నదని హరీశ్‌ పేర్కొన్నారు.

కొన్ని జిల్లాల్లో పెసర ముక్కలుగా విడిపోయిందని, దెబ్బతిన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో పెసర కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలను సడలించాలని కోరారు. ఇప్పటివరకు క్వింటాకు 3 శాతం వరకు ముక్కలైపోయిన పెసర గింజలను అనుమతించేవారని, దానిని 6 శాతానికి పెంచుతూ సవరించాలని కోరారు. దెబ్బతిన్న శాతాన్ని 3 నుంచి 9 శాతానికి పెంచాలని హరీశ్‌ విజ్ఞప్తి చేశారు. కొద్దిమొత్తంలో దెబ్బతిన్న పెసరకు ప్రస్తుతం 4 శాతం వరకు అంగీకారం ఉండేది. దాన్ని ఏడు శాతానికి పెంచాలని కోరారు. పరిపక్వత రాని పెసరను 3 నుంచి 8 శాతానికి పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణించి సడలింపు ఇవ్వాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.

మరిన్ని వార్తలు