రైతు ఉసురు తీసిన బ్యాంకు నోటీసు

2 Jul, 2014 02:03 IST|Sakshi
రైతు ఉసురు తీసిన బ్యాంకు నోటీసు

చింతపల్లి:  ఆరుగాలం కష్టపడినా ఆ రైతుకు అప్పులే మిగిలాయి. తనకున్న రెండెకరాల పొలాన్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తే కాలం కలిసి రాలేదు. నీరు లేక, సకాలంలో కరెంటు రాక పంట సరిగా పండలేదు. అయినా నిరాశ చెందలేదు. వ్యవసాయమంటే అతడికి ప్రాణం. ఈసారైనా అదృష్టం కలిసిరాక పోతుం దా.. అని మళ్లీ నాగలి పట్టాడు. కట్టుకున్న భార్యను ఒప్పించి బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టాడు. రుణాలు తెచ్చి పొలంలో పోశాడు. మళ్లీ అప్పులే దిగుబడిగా వచ్చాయి. అంతే! ఇంతలో యమదూతలా బ్యాంకు నోటీసు ఇంటికి రానే వచ్చింది. అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నాడు.‘బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణం రెండు రోజుల్లో  చెల్లించాలి.. లేకుంటే తాకట్టుపెట్టిన బంగారం వేలం వేస్తాం’ అంటూ బ్యాంకు అధికారు లు పంపిన నోటీసు ఓ యువరైతు ఊపిరి తీసింది.

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన జంగిటి శ్రీను(32) తన రెండెకరాల భూమి పత్రాలను చింతపల్లి గ్రామీణ వికాస్‌బ్యాంకులో పెట్టి గత ఏడాది రూ.40 వేలు, బంగారు ఆభరణాలు తాకట్టుతో మరో రూ.48 వేలు అప్పుగా తీసుకున్నాడు. పంట సరిగా పండకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. కాగా, బంగారు ఆభరణాలను వేలం వేయునున్నట్లు మూడు రోజుల క్రితం శ్రీనుకు బ్యాంకు నోటీసు అందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై వుంగళవారం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడని బాధితుని కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు