ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

3 Jun, 2015 20:49 IST|Sakshi
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఎన్నికను సవాలు చేస్తూ వీరిపై పోటీ చేసి ఓడిపోయిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు కె.హన్మంతరెడ్డి, గొట్టిపాటి పద్మారావు, జి.రామ్మోహన్‌గౌడ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లను (ఈపీ) ఉమ్మడి హైకోర్టు కొట్టి వేసింది. ఈ పిటిషన్లలో పిటిషనర్లు తాము చేసిన ఆరోపణలకు పిటిషనర్లు తగిన ఆధారాలు చూపలేదని, అందువల్ల ఈ ఎన్నికల పిటిషన్లను కొట్టివేయాలంటూ వివేకానంద తదితరులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తీర్పు వెలువరించారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్.బి.నగర్ నియోజకవర్గాల్లోని కొందరు ఓటర్లు అటు ఆంధ్ర ప్రాంతంలోని సొంత ఊళ్లలో, ఇటు నివాసం ఉంటున్న నియోజకవర్గంలో రెండు చోట్ల ఓటు హక్కు ఉపయోగించుకున్నారని హన్మంతరెడ్డి తదితరులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవడం చట్టవిరుద్ధమని, అందువల్ల వారి ఎన్నిక చెల్లనిదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఎన్నికల పిటిషన్లలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించారు. అయితే పిటిషనర్లు ఎటువంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదు. ఈ నేపథ్యంలో సీపీసీ (సివిల్ ప్రొసీజర్ కోడ్) నిబంధనలను అనుసరించి తమపై దాఖలైన ఎన్నికల పిటిషన్లను కొట్టివేయాలంటూ వివేకానంద తదితరులు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పిటిషనర్లు తమ ఆరోపణకు సంబంధించి తగిన ఆధారాలు చూపలేకపోయారని తేల్చి చెప్పారు. అందువల్ల ఈ ఎన్నికల పిటిషన్ల కొట్టివేత కోసం వివేకానంద, మాధవరం కృష్ణారావు, కృష్ణయ్యలు దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్లను అనుమతినిస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు