‘పసివాడి ప్రాణం’ కోసం..

3 Aug, 2017 01:16 IST|Sakshi
‘పసివాడి ప్రాణం’ కోసం..

నడుంకట్టిన మిత్రులు, శ్రేయోభిలాషులు
సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు రూ. 20 లక్షల సేకరణ  

గజ్వేల్‌: లక్షల మందిలో ఒకరికి సంక్రమించే ‘బిలరి అస్టీరియా’వ్యాధి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బాబును కబళించడంతో ఆ దంపతులు కుంగిపోయారు. అయితే మానవత్వం పరిమళించి పసివాడిని మేం బతికిస్తాం.. అంటూ మిత్రులు, శ్రేయోభిలాషులు ముందుకొచ్చి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఫలితంగా రూ. 20 లక్షలు పోగయ్యాయి. గజ్వేల్‌ పట్టణానికి చెందిన దేవసాని హనుమాన్‌దాస్‌–ఉమామహేశ్వరి దంపతులు.

హనుమాన్‌దాస్‌ స్క్రీన్‌ ప్రింటింగ్‌ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. వీరికి ఏడాది క్రితం కవలపిల్లలు జన్మించారు. వారిలో కూతురు స్వీకృతి ఆరోగ్యంగా ఉండగా.. శ్రీమాన్‌కు 4 నెలల క్రితం పచ్చకామెర్లు సోకాయి. ఈ క్రమంలోనే ఆ బాబును నిలోఫర్‌లో చూపించారు. పుట్టుకతో వచ్చిన పచ్చకామెర్ల వల్ల కాలేయం దెబ్బతిన్నదని అక్కడి వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ చేసినా విజయవంతం కాకపోవడంతో సమస్య యథాతథంగానే మారింది. నిలోఫర్‌ వైద్యులు పరీక్షల కోసం నిమ్స్‌కు పంపిం చారు. 

శ్రీమాన్‌కు ‘బిలరి అస్టీరియా’అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు అక్కడ గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కాలేయ మార్పిడే తరుణోపాయమని.. ఈ ఆపరేషన్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన మహ్మద్‌ రేలా అనే వైద్యుడు మాత్రమే చేయగలరని తెలిపారు. డాక్టర్‌ రేలా హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రికి తరచూ వస్తారని తెలుసుకున్నారు. కానీ ఆపరేషన్‌కు రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి.. చేతిలో చిల్లిగవ్వలేక... కన్నకొడుకును దక్కించుకునే మార్గం తెలియక ఆందోళన చెందాడు. ఇదే సమయంలో హనుమాన్‌దాస్‌ మిత్రులు గజ్వేల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మేల నవీన్, బషీర్‌బాగ్‌ ఎస్‌ఐ వెంకటేశ్, హరీశ్‌రెడ్డి, తౌటి శ్రీనివాస్, శ్రీకాంతాచారి, గుంటుక శ్రీనివాస్, గుడాల రాధాకృష్ణ, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌ తదితరులు అండగా నిలిచారు.

శ్రీమాన్‌ స్థితిపై వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా ఆపరేషన్‌కు ఆదుకోవాలని వినతులు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది స్పం దించారు. శస్త్రచికిత్స చేయించనున్న గ్లోబల్‌ ఆసుపత్రి అకౌంట్‌కు ఇప్పటి వరకు 1,250 మంది రూ. 20 లక్షల వరకు అందించారు. ఇందులో ప్రధానంగా వర్గల్‌ విద్యాసరస్వతీ ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి రూ.లక్ష విరాళంగా అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. తన కన్నపేగును బతికించుకోవడానికి తల్లి ఉమామహేశ్వరి కాలేయం ఇస్తోంది. ఇం దుకు సంబంధించి బాబుకు, ఉమామహేశ్వరికి వేర్వేరుగా పరీక్షలు చేశారు. మొత్తానికి రెండుమూడు రోజుల్లో ఆపరేషన్‌ జరగనుండగా.. తమ బాబు మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాడని, అందరిలా ఆడుకుంటాడనే ఆశతో ఉన్నారు.

ఆపరేషన్‌కు రూ.20 లక్షలు సర్దుబాటు అయినా భవిష్యత్తులో జరిగే చికిత్స ఖరీదైనదేనని వైద్యులు చెబుతు న్నారు. ఆరు నెలలపాటు నెలకు రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష వరకు ఖర్చవుతుందని చెబుతున్నట్లు హనుమాన్‌దాస్‌ తెలిపారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. దాతలు  తన ఖాతా నంబర్‌: 4174101000434, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: సీఎన్‌ఆర్‌బీ0004174 –కెనరా బ్యాంక్‌ గజ్వేల్‌ శాఖకు విరాళాలు పంపించాలని కోరారు.
ప్రభుత్వం ఆదుకోవాలి

మరిన్ని వార్తలు