సమగ్ర సర్వేపై విస్తృత ప్రచారం

9 Aug, 2014 03:03 IST|Sakshi
  •        ‘గులాబీ’ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
  •      11న గ్రామాల్లో ర్యాలీలు, సభలు
  •      12న మండల కేంద్రాల్లో సమావేశాలు
  •      16న విద్యార్థులచే ర్యాలీలు
  •      టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు
  • హన్మకొండ సిటీ : సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు దోహదపడే సమగ్ర సర్వేపై టీఆర్‌ఎస్ తరఫున విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

    సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలనే లక్ష్యంతోపాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమగ్ర సర్వేకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చా రు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషిచేయూలన్నారు. అనంతరం సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించేందు కు టీఆర్‌ఎస్ తరఫున నిర్వహించనున్న ప్రచార కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు.

    ఈ నెల 11న టీఆర్‌ఎస్ గ్రామ శాఖల అధ్వర్యంలో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేరోజు గ్రామ నడిబొడ్డున బహిరంగ సమావేశం నిర్వహించి సర్వే ప్రాధాన్యాన్ని వివరిస్తామన్నారు. 12న ఉదయం 11 గంటలకు మండల కేంద్రాల్లో సమావేశాలు, 16న పాఠశాలల విద్యార్థులతో గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ర్యాలీలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. 17 పార్టీ జిల్లా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామన్నారు.
     
    వారి విమర్శలు అర్థం లేనివి...
     
    రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు అర్థం పర్థం లేని విమర్శ లు చేస్తున్నారని... అవాకులు, చెవాకు లు పెలుతున్నారని రవీందర్‌రావు ధ్వ జమెత్తారు.  రాజకీయ అవినీతి, దళారులు లేని ప్రజాపాలన జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు.

    విద్యుత్ ప్రాజెక్టులన్ని సీమాంధ్రలో ఉన్నాయ ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. విద్యుత్ సరఫరా లోపంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రజలకు వివరించారని, దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.

    మూడేళ్లలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎయిమ్స్ అస్పత్రి స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం అదేశించిందని తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు నాయకులు  భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, మార్నేని రవీందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, గైనేని రాజన్, సంపత్, అంజయ్య, జయరాజ్, పీఆర్‌రెడ్డి, జోరిక రమేశ్, చాగంటి రమేశ్, నయూమొద్దీన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు