బ్యాంకు దోపిడీకి విఫలయత్నం

21 Jul, 2016 05:13 IST|Sakshi
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
మొయినాబాద్: అర్ధరాత్రి దుండగులు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచే సమయంలో ఇద్దరు యువకులు గమనించి పట్టుకునే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరుపుతూ పారిపోయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో మంగళవారం రాత్రి 1.20 గంటల సమయం లో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది మంగళవారం పనివేళలు ముగిసిన తర్వాత తాళాలు వేసి వెళ్లిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో దుండగులు అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుని తాళాలు పగులగొట్టారు.

అదే సమయంలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న శ్రీనాథ్‌రెడ్డి, శ్రీనివాస్ బ్యాంకు తాళాలు పగులగొడుతున్న ఇద్దరిని గమనించి కేకలు వేశారు. దీంతో దుండగులు పారిపోతుండగా యువకులు బైక్‌పై వెం బడించారు. ఈ క్రమంలో దుండగులు కొంతదూరం పరుగెత్తి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడిన యువకులు వెనక్కి తగ్గారు. బ్యాంకుకు కొంత దూరంలో ఉన్న మరో దుండగుడు సైతం గ్రామంలోకి పరుగు తీశాడు. దుండగులు గ్రామం పక్కనే ఉన్న ఓ వెంచర్ ప్రహరీ గోడ దూకి పారిపోయారు. యువకులు 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో మొబైల్ పార్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో లభ్యమైన బుల్లెట్ షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకోవడానికి సాహసం చేసి వెంబడించిన యువకులను డీసీపీ కార్తికేయ అభినందించారు.

 

మరిన్ని వార్తలు