బతికి బయటపడి.. మళ్లీ ఉరేసుకొని..

28 May, 2017 02:23 IST|Sakshi

చిగురుమామిడి: నాలుగేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు.. ఇద్దరు పిల్లల అనారోగ్యం వెరసి అప్పులు పెరిగిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఆ రైతు వారం క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో చికిత్స అందించడంతో బతికి బయటపడ్డాడు. ఇంత జరిగినా.. ఆ రైతుకు బతుకుపై ఆశ పుట్టలేదు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి ఉరేసుకున్నాడు. ఈ విషాద ఉదంతం కరీంనగర్‌ జిల్లాలో శనివారం జరిగింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన కౌలు రైతు బత్తుల రాజయ్య(48) తన ఎకరంతోపాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, ఇతర పంటలు వేస్తున్నాడు.

నీరు లేక నాలుగేళ్లుగా వేసిన పంట వేసినట్లే ఎండిపోతుండడం.. దిగుబడి సక్రమంగా రాకపోవడంతో అప్పుల పాల య్యాడు. మరో వైపు కుమారుడు, కూతురు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వారి వైద్యం కోసమూ అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పు రూ. 5 లక్షలకు చేరింది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడం.. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల 20 పురుగుల మందు తాగాడు. వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా, బతికి బయటపడ్డాడు. నాలుగురోజుల క్రితం ఇంటికి చేరుకున్న రాజయ్య శనివారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.

మరిన్ని వార్తలు