సర్వేకు చక్కటి స్పందన

20 Aug, 2014 00:31 IST|Sakshi
సర్వేకు చక్కటి స్పందన

వివరాలు నమోదు చేసుకున్న ఇన్‌చార్జి కలెక్టర్
- పట్టణంలో కర్ఫ్యూ మాదిరి వాతావరణం
- నిర్మానుష్యంగా సంగారెడ్డి
- స్వచ్ఛందంగా సినిమా హాళ్లు,
 - పెట్రోల్ బంకుల మూత
సంగారెడ్డి మున్సిపాలిటీ/క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.  సర్వే సందర్భంగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు సైతం తిరగకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొని వివరాలను తెలియజేశారు.

ఏఎస్పీ మధుమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తదితరులు సంగారెడ్డిలో కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్  బొంగుల విజయలక్ష్మి సోమేశ్వర వాడలో పేర్లు నమోదు చేయించుకున్నారు. మాజీ ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి స్థానికంగా లేకపోవడంతో సర్వేలో పాల్గొనలేకపోయారు.  మున్సిపల్ వైస్‌చైర్మన్ గోవర్దన్ నాయక్ సర్వేలో పాల్గొని కుటుంబ వివరాలను తెలియజేశారు.    సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ఇంటి నంబర్లు దొరకక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  మంజీరా నగర్‌లోని 7-8-686/4/6 నంబరు గల ఇంటిలో యజమాని రాజయ్య పేరు ఉందని 739వ ఎన్యూమరేటర్‌కు మున్సిపల్ అధికారులు సమాచారం ఇచ్చారు.

అదే ఇంటి నంబరు ప్రభుగౌడ్ పేరును మరో ఎన్యూమరేటర్‌కు ఇవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రశాంత్‌నగర్‌లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు సర్వేలో పేర్లను నమోదు చేయించుకోగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. తమకు ఆధార్, ఓటరు కార్డుతో పాటు సొంత ఇల్లు ఉన్నందున ఇక్కడే నమోదు చేయించుకుంటామని చెప్పగా, స్థానికులు అడ్డుకొని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతరం వారి పేర్లను ఇక్కడ నమోదు చేయించవద్దని స్థానికులు అధికారులను కోరారు. సర్వేకు ముందుగా రెండు రోజుల పాటు నిర్వహించిన  ప్రీ సర్వే సమయంలో కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సర్వే ఫారాలను తీసుకువచ్చిన సిబ్బందికి సర్వే చేసే రోజు వారి సంఖ్య పెరగడంతో ఫారాలు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైంది. సర్వేను ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌తో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తహశీల్దార్ రాధాబాయి, మున్సిపల్ ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.
 
పట్టణం నుంచి పల్లెలకు...
సర్వేలో పాల్గొనేందుకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పట్టణంలోని వివిధ పరిశ్రమలు, అడ్డా కూలీలు, వ్యాపార సంస్థలో పనిచేస్తున్న కార్మికులు స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో పట్టణంలోని కొత్త సంగారెడ్డి ప్రాంతంలో మెజార్టీ ఇళ్లకు తాళాలు వేసి ఉండడం కనిపించింది.  ఇంటి యజమానులు హైదరాబాద్‌లో స్థిరపడగా స్థానికంగా ఉన్న ఇండ్లను అద్దెకు ఇచ్చారు. అద్దెకుంటున్న వారు సైతం సర్వేలో పాల్గొనేందుకు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పట్టణంలోని పలు కాలనీలు జన సంచారం లేక వెలవెలబోయాయి.
 
తప్పుడు సమాచారమిస్తే చర్యలు
సిద్దిపేట టౌన్: సర్వే సందర్భంగా తప్పుడు సమాచారమిస్తే తిప్పలు తప్పవని సర్వే మెదక్ స్పెషలాఫీసర్,  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ బుర్ర వెంకటేశం, ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ హెచ్చరించారు. సిద్దిపేట రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు.
  మన ఊరు- మన ప్రణాళిక పక్కాగా రూపొందించుకొని అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామన్నారు. ఇందుకు ప్రజల నుంచి  స్వచ్ఛందంగా వస్తున్న స్పందన అభినందనీయమన్నారు.  జిల్లాలో 8.48 లక్షల కుటుంబాలు ఉండగా 32 వేల మంది సిబ్బందిని సర్వే కోసం ఏర్పాటు చేశామన్నారు. సర్వే కన్నా ముందు ఇళ్ల సంఖ్యను లెక్కించామని, ఇందుకు అనుగుణంగా నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లను నియమించామని, రిజర్వ్‌లో సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని, సపోర్ట్ ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేశామని, సర్వేలో అవాంతరాలు చోటు చేసుకోకుండా వివిధ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేశామని వివరించారు.

అయితే కొందరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వేర్వేరు కుటుంబాల పేరుతో నమోదు చేయించుకోవడంతో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగాయన్నారు. కుటుంబాల సంఖ్య కన్న 15 శాతం ఎక్కువ సర్వే ఫారాలను ఏర్పాటు చేసినప్పటికీ స్వల్ప కొరత ఏర్పడిందన్నారు. వెంటనే అదనపు సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని ఎంత రాత్రి అయినా సర్వేను పూర్తి చేస్తామని, అన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తామన్నారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేయాలో, ఎవరికి సంక్షేమ ఫలాలు అందించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందని ప్రజలు కూడా పారదర్శకంగా ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. సమావేశంలో గడా స్పెషల్ ఆఫీసర్ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు