రక్షణ రంగానికే తలమానికం ‘ఆకాష్’

29 Jul, 2015 02:46 IST|Sakshi
రక్షణ రంగానికే తలమానికం ‘ఆకాష్’

దేశానికి కీలకమైన ఆయుధం
♦ ఆనాటి రక్షణ మంత్రికి అప్పట్లో వివరించిన కలాం
♦ ‘సాక్షి’తో డీఆర్‌డీఎల్  ఆకాష్ {పాజెక్టు డెరైక్టర్ చంద్రమౌళి
 
 మధిర :  భారతీయ పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు రూపకల్పన చేసిన ఆకాష్ క్షిపణి దేశ రక్షణ రంగానికే తలమానికమని హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబరేటరీ(డీఆర్‌డీఎల్) ఆకాష్ ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి అన్నారు. మధిరలో జన్మించి, మధిరలోనే చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న ఆయన ప్రస్తుతం డీఆర్‌డీఎల్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. డాక్టర్ అబ్దుల్ కలాంతో ఉన్న అనుబంధాన్ని మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించారు.

      1981లో డీఆర్‌డీఎల్‌లో చేరిన అబ్దుల్ కలాం శిష్యరికంలో ఒకడిగా పనిచేసిన అదృష్టం దక్కిందన్నారు. 1983లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి ఐదు బాలిస్టిక్ మిసైల్స్ రూపకల్పనకు అంకురార్పణ జరిగిందన్నారు. ఆకాష్ ప్రాజెక్టును తనకు అప్పగించినట్లు తెలిపారు. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలు అసూయపడేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించినట్లు తెలిపారు. ఆకాష్ క్షిపణి రూపకల్పన కోసం డీఆర్‌డీఎల్‌లోని 13 లేబరేటరీలు, 11 ప్రభుత్వ రంగసంస్థలు, ఐదు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఐదు అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేసి 20 ఏళ్లపాటు చేసిన కృషి ఫలితంగా ఈ క్షిపణికి రూపం వచ్చిందన్నారు.

ఆకాష్ విజయవంతమయ్యేందుకు రూ.588కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. భారత ప్రభుత్వంలోని ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలు ఈ క్షిపణి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేసి తమ అమ్ముల పొదిలో రక్షణ కవచంగా పెట్టుకునేందుకు 2,500 క్షిపణుల తయారీకి రూ.22వేల కోట్ల ఆర్డర్ డీఆర్‌డీఎల్‌కు వచ్చిందన్నారు. దేశంలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అన్నారు. ఈ క్షిపణి తయారీకి ఉపయోగించిన రామ్‌జెట్ రాకెట్ టెక్నాలజీ ఇండియా, రష్యా దేశాల్లోనే ఉందన్నారు. పూర్తి కంప్యూటర్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సూపర్ సానిక్ ఆకాష్ క్షిపణి మిస్సైల్ 30 సెకండ్లలో 90 కిలోమీటర్ల దూరంలోని ఏకకాలంలో ఎటునుంచి వచ్చే లక్ష్యాన్నైనా ఛేదిస్తుందన్నారు.

ఆకాష్ క్షిపణి భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఆయుధమన్నారు. ఆకాష్ క్షిపణి ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2013లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో ఈ క్షిపణి సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అప్పుడు 72దేశాలు పాల్గొని తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగా.. ఆకాష్‌కు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయన్నారు. ఈ ఘనత అబ్దుల్ కలాం ఆశీస్సులతోనే సాధించినట్లు తెలిపారు. ఆయనతో 13 ఏళ్లకుపైగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తెలియని విషయాన్ని ఆయన అర్థమయ్యే విధంగా చెప్పేవారని, ఆయన ప్రోత్సాహంతోనే శాస్త్రవేత్తగా మరింత గుర్తింపు వచ్చిందన్నారు.

 మెచ్చుకున్న కలాం..
 1987లో ఆకాష్ క్షిపణిని రూపొందించినట్లు డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. నేను డెరైక్టర్‌గా ఉండి ఆకాష్ క్షిపణిని డిజైన్ చేసి రూపొందించాను. మిస్సైల్ లాంచింగ్‌కు ముందుగా పరిశీలించేందుకు వచ్చిన కలాం సార్ అతితక్కువ సమయంలో రూపొందించిన ఆకాష్ క్షిపణి అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చాలా సంబరపడ్డాను. అప్పట్లో రక్షణ మంత్రి కేసీ పంత్‌కు కలాం సార్ ఆకాష్ క్షిపణి శక్తిసామర్థ్యాలను స్వయంగా వివరించారు. కలాం మృతి దేశ ప్రజలతోపాటు వ్యక్తిగతంగా కూడా నాకు తీరనిలోటని చెప్పారు.

మరిన్ని వార్తలు