రోడ్డు పక్కన రేషన్ కందిపప్పు ప్యాకెట్ల గుట్ట

21 Sep, 2015 11:39 IST|Sakshi

నిరుపేదలకు అందించాల్సిన సబ్సిడీ కందిపప్పును రేషన్ డీలర్లు అక్రమంగా షాపులకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్డు గాడుదల వాగు వద్ద రోడ్డు పక్కన సోమవారం ఉదయం రేషన్ కందిపప్పు ఖాళీ ప్యాకెట్లు గుట్టగాలుగా పడి ఉన్నాయి.  ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఈ ప్యాకెట్లపై తయారీ ముద్రలు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. 

రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ హుస్సేన్, వీఆర్వోలు కె.శ్రీధర్, వెంకటేశ్వర్లు హడావుడిగా ఆ ఖాళీ ప్యాకెట్లను బస్తాలలో కుక్కి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. మండలంలో మూడు నెలల నుంచి సరిగా సబ్సిడీ కందిపప్పు పంపిణీ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.140వరకు ఉండటంతో అదే అదనుగా భావించిన కొందరు రేషన్ డీలర్లు నిరుపేదల పొట్టగొట్టి షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సత్తుపల్లి పట్టణంలోని ఐదు రేషన్ దుకాణాల్లో విచారణ నిర్వహిస్తామని సివిల్ సప్లై డీటీ కరుణాకర్ తెలిపారు. అవసరమైతే పక్క మండలాల చౌక ధరల దుకాణలపైన కూడా విచారణ చేస్తామని అన్నారు.
 

మరిన్ని వార్తలు