మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

12 Mar, 2016 01:46 IST|Sakshi
మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

వరంగల్ క్రైం : ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యురాలు కుంజమ్ ఇడుమన్ అలియాస్ కవిత శుక్రవారం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఎదుట లొంగి పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం నీలంపల్లి గుంపు (బుట్టాయిగూడెం)కు చెందిన కుంజమ్ ఇడుమన్ అలియాస్ కవిత తల్లిదండ్రులకు పెద్దకుమార్తె. ఈమెకు ముగ్గురు తమ్ములు ఉన్నారు. కవితను పెళ్లిచేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడితేవడంతో ఇంటి నుంచి వెళ్లిపోరుుంది. 2011-12 మధ్య కాలం లో మేకల రాజు అలియాస్ మురళి ప్రోద్బలంతో వెంకటాపూర్ ఏరియా కమిటీలో దళసభ్యురాలిగా చేరింది. 2013 జూలై వరకు అదే కమిటీలో కొనసాగింది.

ఆ తర్వాత కెకెడబ్ల్యు (కరీంనగర్, ఖమ్మం, వరంగల్) డివిజన్ కమిటీలోఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీకి బదిలీ అయింది. కవిత  కెకెడబ్ల్యు కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తో మావోయిస్టు పార్టీ కార్యాక్రమాలలో చురుకుగా పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. కవిత రెండు సార్లు పోలీసు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నదని, ఒక సారి పోలీసు ఔట్‌పోస్టుపై దాడి చేసిందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించిన మినాపా సీఆర్‌పీఎఫ్ అంబుష్‌లో పాల్గొన్నదని, దీపల్లి గ్రామం భద్రకాళి తహసిల్, చత్తీస్‌గడ్ రాష్ట్రంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులలో పాల్గొన్నదని, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కంబాలపేట అటవీ ప్రాం తంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె తప్పించుకున్నదని వివరించారు. అనారోగ్య కారణాలతో పాటు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక లొంగిపోయినట్లు కవిత తెలిపింది.
 
 

మరిన్ని వార్తలు