త్యాగనిరతిని చాటిచెప్పే బక్రీద్

6 Oct, 2014 02:11 IST|Sakshi

బాన్సువాడ/బిచ్కుంద/నిజామాబాద్ కల్చరల్ :  త్యాగనిరతిని చాటి చెప్పే బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్,  కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఈద్‌గా్‌హ లలో ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 పండుగ నేపథ్యం
 ప్రవక్త హజ్రత్ ఇబ్రాహిం అలై సలాంకు మూడురోజుల పాటు అల్లాహ్ కలలో ప్రత్యక్షమై ‘నా కోసం నీకు ఇష్టమైన వస్తువును త్యాగం (ఖుర్బాన్)’ చేయాలని ఆజ్ఞాపిస్తారు. తనకు ఇష్టమైనది తన కుమారుడైన ఇస్మాయిలేనని, అల్లాహ్ కోసం దేనికైనా సిద్ధమని ఇబ్రాహిం(స) చెబుతారు. ఇస్మాయిల్‌ను తీసుకుని మక్కా షరీఫ్ నుంచి మదీనాకు ఒంటెపై తీసుకెళ్తుంటారు.

 అప్పుడు మార్గమధ్యలో వారి మనసును మార్చేందుకు మూడు సార్లు షైతాన్ అడ్డుపడుతుంది. హజ్రత్ ఇబ్రాహిం(స) తన మనసును మార్చకుండా షైతాన్‌ను రాళ్లతో కొట్టి తరిమివేస్తారు. అనంతరం మదీనాలోని మీనా వద్ద దైవనామ స్మరణ చేస్తూ ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ (కోయడం) చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడే అల్లాహ్ దూత అయిన హజ్రత్ జిబ్రాయిల్ అలైసలాం, స్వర్గం నుంచి తెచ్చిన పొట్టెలును ఇస్మాయిల్ స్థానంలో ఉంచుతారు.

 ప్రవక్త చేయదల్చిన త్యాగంతో అల్లాహ్ ప్రసన్నడవుతారు. ‘కేవలం కలలో చూసిన దాన్ని నిజం చేసి చూపించావు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలితో నాకు నిమిత్తమేమి లేదు. ఈ శుభసమయంలో మీ త్యాగనిరతికి గుర్తింపుగా ఈ పొట్టెలును పంపించాను’ అని ప్రసన్నులవుతారు. అప్పటి నుంచి ముస్లింలు ప్రతీ ఏడాది అదే బక్రీద్ రోజు పొట్టేలు, మేకలను అల్లాహ్ కోసం ఖుర్బాన్ (త్యాగం) చేస్తారు.  

 ఈద్‌గాహ్‌ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
 బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు సోమవారం ఈద్‌గాహ్‌ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లాకేంద్రంలోని ఖిల్లా, గాంధీచౌక్, ధర్మపురిహీల్స్ వద్ద గల ఈద్‌గాహ్‌ల్లో ఇప్పటికే ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటిని ఆదివారం నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫయిమ్, కార్పొరేటర్ అజీజ్, మున్సిపల్ అధికారులు స్థానిక ఖిల్లా ఈద్‌గాహ్‌ను సందర్శించారు.

>
మరిన్ని వార్తలు