తీపి పంట పండించినా చేదు అనుభవమే..

27 Aug, 2015 01:25 IST|Sakshi

 అమరచింత (నర్వ) : చెరుకు పండించిన రైతుకు నిరాశ ఎదురైంది. దీంతో ఆ రైతు మనస్తాపానికి గురై తన ఐదెకరాల పంట చేను ట్రాక్టర్ తొలగించిన సంఘటన బుధవారం ఆత్మకూర్ మండలంలోని అమరచింత గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..  ఆత్మకూరు మండల పరిధిలోని అమరచింత గ్రామానికి చెందిన రైతు గొల్ల శ్రీనివాసులు గత ఏడాది కొత్తతాండాకు సమీపంలోగల తన సొంత వ్యవసాయపొలంలో ఐదెకరాలలో చెరుకు పంటను వేశారు. మొదటి విడతగా కోత ద్వారా 150 టన్నుల చెరుకు దిగుబడి రూపంలో రాగా వాటినంతటిని సమీపంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి తరలించారు.

అయితే ఆరు నెలల నుంచి రైతుకు ఇవ్వాల్సిన రూ.2 లక్షలను ఫ్యాక్టరీ వారు ఇగ ఇస్తామంటూ  దాటవేస్తున్నారు. దీంతో ఆ రైతు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో మనస్తాపానికి గురై తాను సాగు చేసిన చెరుకు పంటను పూర్తిగా తొలగించడానికి పూనుకున్నాడు. విషయం తెలిసి ఫ్యాక్టరీ సిబ్బంది వచ్చి వారించినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు రైతు తన 5 ఎకరాల పొలాన్ని అంతా ట్రాక్టర్‌తో దున్ని చదును చేశాడు.

>
మరిన్ని వార్తలు