అవ్వకెంత కష్టం..!

12 Dec, 2016 15:12 IST|Sakshi
అవ్వకెంత కష్టం..!

2005 కంటే ముందటి 500 నోట్లు చెల్లవన్న బ్యాంకు అధికారులు

 కారేపల్లి: ఈ ఫొటోలో కనిపిస్తున్న అవ్వ పేరు బొమ్మసాని ఐలమ్మ.. 90 ఏళ్లకు పైబడి ఉంటాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి బస్టాండ్ సెంటర్‌కు చెందిన ఈ అవ్వకు పెద్ద నోట్లు చెల్లవనే విషయాన్ని ఇటీవలే ఎవరో చెవిలో వేశారు. ఉన్న డబ్బులను బ్యాంకులో వేసుకోవాలని చెప్పారు. కంగారు పడిన ఐలవ్వ పదేళ్ల నుంచి ఇనుపపెట్టేలో భద్రంగా దాచుకున్న రూ. 500 నోట్లు బయటకు తీసింది. మొత్తం 32 నోట్ల వరకు ఉన్నాయి. వాటిని పట్టుకొని తన ఖాతా ఉన్న కారేపల్లి ఎస్‌బీహెచ్‌కు వెళ్లింది. వాటిని పరిశీలించిన బ్యాంక్ మేనేజర్ ఇందులో సుమారు 22 నోట్లు 2005 కంటే ముందు ముద్రించినవని.. అవి చెల్లవని చెప్పారు.

ఐలవ్వకు ఆరుగురు కుమార్తెలు కాగా, భర్త ముత్తిలింగయ్య నలభై ఏళ్ల క్రితమే చనిపోయాడు. బిడ్డల పెళ్లిళ్లు అరుుపోగా.. ఒక్కతే ఇంట్లో ఉంటూ తన పనులు తానే చేసుకుంటూ జీవిస్తోంది. అప్పుడప్పుడు వచ్చి పోయే బిడ్డలు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో చిల్లర మాత్రమే ఖర్చు పెట్టుకొని.. రూ. 500 నోట్లు దాచుకుంది. అవి కాస్త బ్యాంక్ మేనేజర్ చెల్లవని చెప్పడంతో లబోదిబోమంటోంది. 2005 కంటే ముద్రించిన రూ.500 నోట్లను ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే రద్దు చేసిన విషయం తెలియని వృద్ధురాలు ఇప్పుడు కనబడిన వారినల్లా తన నోట్లు మార్చి ఇవ్వండని వేడుకుంటోంది.

మరిన్ని వార్తలు