ఓ తల్లి కథ..!

9 Apr, 2017 03:39 IST|Sakshi
ఓ తల్లి కథ..!

భర్త వైద్యం కోసం.. పసికందును అమ్మేసిన వైనం

ఓదెల(పెద్దపల్లి): ఓ వైపు చచ్చుబడిన కాళ్లతో మంచాన పడ్డ భర్త.. మరోవైపు ఆకలితో అల మటిస్తున్న ముగ్గురు పిల్లలకు బువ్వ పెట్టలేని దైన్యం.. చివరకు  భర్తకు వైద్యం చేయించేందుకు, ఆకలితో కడుపు మాడుతున్న పసి హృదయాల గోస చూడలేక పేగుబంధాన్ని మరిచి ఆరు నెలల పసిగుడ్డును అమ్మేసింది. పదిరోజుల తర్వాత కొడుకుపై మమ కారం చావక బాబును ఇప్పిం చాలని పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కింది ఓ మాతృమూర్తి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె తండాకు చెందిన గుగులోతు తేజ, కవిత దంపతులకు ముగ్గురు సంతానం. 

మహేశ్‌(5), కుమార్తె మహదేవి (3),  బాబు (6 నెలలు) ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని గిరిజన కుటుంబం. చిన్న ఇల్లు తప్ప ఆస్తి పాస్తులు లేవు. భార్యాభర్తలిద్దరూ రోజూ కూలీలు. ఆరునెలల క్రితం తేజ వెన్నెముకకు టీబీ వ్యాధి సోకి రెండు కాళ్లు చచ్చుబడిపో యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెన్నెముకకు ఆపరేషన్‌ చేయించినా ఫలితం లేకపోయింది. తేజ పూర్తిగా మంచానికే పరి మితమయ్యాడు.దీంతో రోజు కూలికి వెళ్లే కవిత భర్తకు సపర్యలు చేస్తూ ఇంటివద్దే ఉంటుండగా పూట గడవడం కష్టంగా మారింది. మరోవైపు   పిల్లలను సాకలేని పరిస్థితి. కవిత తన భర్త కాళ్లను బాగు చేసుకుని కుటుంబాన్ని చక్కదిద్దు కోవాలనుకుంది.

గత నెల 31న అదే గ్రామానికి చెందిన సంతానం లేని సింగరేణి కార్మికుడికి తన చిన్న కుమారున్ని మధ్యవర్తి ద్వారా లక్ష రూపాయలకు అమ్మేసింది. వారు గోదావరి ఖనిలో నివాసముంటున్నారు. స్థానికంగా దత్తత తీసుకున్నట్టు ప్రచారం చేశారు. కవిత బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి రూ.60 వేలను కుమార్తె పేరిట డిపాజిట్‌ చేసింది. మిగతా రూ.40 వేలను భర్త కోసం, కుటుంబఖర్చుల కోసం వెచ్చించింది. వారం నుంచి చిన్న కుమారుడిపై మమకారం చావక ముభావంగా ఉంటోంది.

కొడుకుపై ప్రేమను చంపుకోలేక బిడ్డను ఇప్పించాలంటూ మధ్య వర్తిని ఆశ్రయించింది. కాళ్లావేళ్లా పడి బతిమి లాడింది. చివరకు ఇచ్చిన రూ.లక్ష వాపసు తీసుకొచ్చి ఇస్తే బిడ్డను ఇచ్చేస్తామని వారు చెప్పారు. దీంతో చేతిలో చిల్లిగవ్వలేక మూడు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లింది. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం తన బాబును ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. బాబును అమ్మించిన మధ్యవర్తిని పిలిపించి మాట్లాడుతున్నట్టు ఎస్సై రమేశ్‌ తెలిపారు. కాగా, భర్త వైద్యం కోసం కన్న కొడుకునే అమ్మడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు