సుడిగాలి పర్యటన!

4 Dec, 2014 01:03 IST|Sakshi

ఆమనగల్లు: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యే క హెలిక్యాప్టర్‌లో వివిధ ప్రభుత్వ శాఖ లకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి వచ్చిన  ఆయన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో మూడున్నర గం టల పాటు పర్యటించారు. ఫార్మా, ఫిల్మ్ సిటీ, ఇతర అవసరాల కోసం ఆమనగల్లు మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను హెలిక్యాప్టర్‌లోనే ఉండి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
 
  సీఎం దిల్‌సంస్థకు ఇచ్చిన భూములను ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే ఈ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూములను సీఎం కేసీఆర్, ఫార్మా కంపెనీల ప్రతినిధుల బృందం సభ్యులు పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ సమీపంలోని జమ్ములబావితండా సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్, ఫార్మా ప్రతినిధులు వేర్వేరుగా నాలుగు హెలిక్యాప్టర్ల ద్వారా చేరుకున్నారు.
 
 మీడియాకు నోఎంట్రీ!
 సీఎం కేసీఆర్ రాకకోసం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముచ్చర్ల సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుంచి 2 కి.మీ ముందునుంచే జమ్ములబావితండా వద్ద పోలీసులను మోహరించారు. ఈ సమయంలో కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు తమకు పాసులు ఉన్నాయని వెళ్లడంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టీఆర్‌ఎస్ నాయకులను పంపిస్తూ మీడియా ప్రతినిధులను అడ్డుకోవడం ఏమిటని పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. సీఎం పర్యటన కవరేజ్ కోసం వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అనుమతి లేకపోవడంతో అక్కడే పడిగాపులుకాశారు.
 
 ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
 రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద ఆమనగల్లు మండలంలో దిల్ సంస్థకు ఇచ్చిన భూములకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్ తిలకించారు. కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంతరెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు