మహిళా అధికారిపై ‘అవినీతి’ పడగ !

23 Jan, 2015 01:48 IST|Sakshi
మహిళా అధికారిపై ‘అవినీతి’ పడగ !

* సహకార శాఖలో ఓ ఉన్నతాధికారి బాగోతం
* అక్రమాలకు పాల్పడిన సొసైటీలకు సహకరించాలంటూ ఒత్తిడి
* మాట వినని మహిళా అధికారులపై వేధింపులు
* కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బెదిరింపులు
* వేధింపులను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన గ్రూప్-1 అధికారి
* ఆధారాలతో సహా ముఖ్య కార్యదర్శి, పోలీసులు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. అయినా స్పందించని ప్రభుత్వం.. నమోదు కాని కేసు శాఖాపరమైన విచారణకూ దిక్కులేదు
* మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించిన బాధితురాలు
* గతంలోనూ మరో మహిళా అధికారిపై వేధింపుల ఆరోపణలు
* ఇంత ‘చరిత్ర’ ఉన్న అధికారికే శాఖాధిపతి బాధ్యతల అప్పగింత!
* ఆరోపణలన్నీ నిరాధారం: సహకారశాఖ ఇన్‌చార్జి కమిషనర్ సురేందర్

 
సాక్షి, హైదరాబాద్: అవినీతి మత్తు తలకెక్కిన ఓ అధికార భూతం ఒక మహిళా అధికారిపై వేధింపులకు దిగింది.. అక్రమాలకు సహకరిస్తావా.. లేదా.. అంటూ హెచ్చరికలు చేసింది.. తన మాట వినకపోతే ‘కెరీర్‌ను సర్వనాశనం చేస్తా’నంటూ బెదిరింపులకు దిగింది.. ఇదంతా తెలిసినా ప్రభుత్వం మాత్రం ఆ అవినీతి భూతానికే మళ్లీ పట్టం కట్టింది.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు, పోలీసుల వ్యవహారంతో ఇప్పుడు ఆమె తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.. నిండు గర్భిణి అయిన ఆమె ఆరోగ్యం కూడా ఈ వేధింపుల కారణంగా దెబ్బతిన్నది.. ఇదంతా రాష్ట్ర సహకార శాఖలో జరుగుతున్న బాగోతం. గ్రూప్-1 ద్వారా ఎంపికైన ఆ మహిళా అధికారి పి.హరిణి.. వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్న అధికారి సహకారశాఖ ఇన్‌చార్జి కమిషనర్ ఎం.సురేందర్.
 
 నిండా అవినీతే..!
 నిండా అవినీతిలో కూరుకుపోయిన సహకారశాఖలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి సొసైటీల అవినీతికి కింది స్థాయి అధికారులు తలూపాల్సిందేననే ఆరోపణలున్నాయి. అలాంటి సొసైటీలకు క్లీన్‌చిట్ ఇవ్వడానికి ‘ఉత్తుత్తి విచారణ’ లతో సహకారం అందించాల్సిందేనని, లేకుంటే అధికారుల కన్నెర్రకు గురికావాల్సిందేనన్న ప్రచారమూ ఉంది. అలాంటి శాఖలో నిక్కచ్చిగా విచారణ జరిపి సొసైటీల్లో అక్రమాలను బయటపెట్టిన హరిణి ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
 
 ఆమె కథనం ప్రకారం...
 రాష్ట్ర సహకార శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న పి.హరిణి విధి నిర్వహణలో భాగంగా గతంలో పలు సొసైటీలపై విచారణ జరిపి అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఆమె నేతృత్వంలోని విచారణ బృందం ‘ఏపీఎన్జీవోల కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’పై విచారణ జరిపి... సివిల్ పనుల్లో రూ. 18 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగినట్లు తేల్చింది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరిపి... అందులో సభ్యులు జమ చేసిన రూ. 4.5 కోట్ల నిధులను పాలకమండలి పెద్దలు దుర్వినియోగం చేశారని గుర్తించి.. గతేడాదే నివేదిక ఇచ్చారు. ఇక గతంలో జరిపిన మరో విచారణలో రూ. 2.5 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. ఆ సొసైటీ సభ్యుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గచ్చిబౌలిలో కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ సొమ్మును ఖర్చు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారని బహిర్గతం చేశారు.
 
 ఈ నివేదికల ఆధారంగా సదరు సొసైటీ పాలకమండలిపై జిల్లా సహకార శాఖ  ఫిర్యాదు మేరకు గతేడాది చార్మినార్ పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. వాస్తవానికి ఓ కార్యాలయం, ఓ బోర్డు, ఓ బీరువా వంటివి కూడా ఏర్పాటు చేసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఆ సొసైటీని నిర్వహించారు. ఈ కేసుకు అత్యంత కీలకమైన సొసైటీ రికార్డులు నిందితుల చేతికి చిక్కితే కేసు నీరుగారే అవకాశముండడంతో విచారణ తర్వాత వాటిని ఆమె తన సంరక్షణలోనే ఉంచుకున్నారు. ఈ రికార్డులను తిరిగి తమకు అప్పగించాలంటూ సొసైటీ పాలకమండలి ప్రతినిధి ఒకరు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది సూచన మేరకు రికార్డుల అప్పగింతను వ్యతిరేకిస్తూ హరిణి కౌంటర్ దాఖలు చేశారు.
 
 ఇచ్చేయాలంటూ ఒత్తిడి..
 అప్పట్లో సీఎం కిరణ్ పేషీలో డిప్యుటేషన్‌పై ఓఎస్డీగా పనిచేసి, సహకార శాఖకు తిరిగి వచ్చిన అదనపు రిజిస్ట్రార్ ఎం.సురేందర్ కీలకమైన ఈ రికార్డుల కోసం హరిణిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఓ సారి గంటలో రికార్డులు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. అయితే కేసు విచారణలో ఉండగా రికార్డులు అప్పగించడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది సలహా ఇవ్వడంతో అదే విషయాన్ని హరిణి తనపై అధికారి సురేందర్‌కు తెలిపారు. అయితే దీనికి ఆయన సమ్మతించలేదు. తన వద్దకు పిలిపించుకుని.. ‘నా మాటే కాదంటావా.. నీ సంగతి చూస్తా.. నీ కెరీర్‌ను నాశనం చేస్తా..’ అంటూ బెదిరించారు. ఇలా రెండు సార్లు సురేందర్ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న ఆమె.. మూడోసారి జాగ్రత్తపడ్డారు. సురేందర్ బెదిరింపులను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన సీడీని సాక్ష్యంగా చూపుతూ నెల రోజుల కిందట (2014 డిసెంబర్ 23న) అబిడ్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకంటే మూడు నెలల ముందే 2014 సెప్టెంబర్ 9న రాష్ట్ర మహిళా కమిషన్‌కు, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు వేర్వేరుగా ఫిర్యాదులు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి.. పై అధికారి వేధింపుల కారణంగా తన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
 
 అయినా ఫిర్యాదులపై సహకార శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టలేదు.. పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. ఇదే విషయమై ఆమె గురువారం రాష్ట్ర మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు అదనపు రిజిస్ట్రార్ సురేందర్ వేధింపులపై గతంలో అనురాధ అనే మరో డిప్యూటీ రిజిస్ట్రార్ చేసిన ఫిర్యాదూ చెత్తబుట్ట పాలైంది. మహిళా అధికారులను వేధిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు రిజిస్ట్రార్ సురేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకారశాఖ ఇన్‌చార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ గత శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 ఆరోపణలు నిరాధారం..
 తనపై డిపూటీ రిజిస్ట్రార్ హరిణి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని సహకారశాఖ ఇన్‌చార్జి కమిషనర్ సురేందర్ పేర్కొన్నారు. తాను ఎలాంటి వేధింపులకూ పాల్పడలేదని ఆయన గురువారం చెప్పారు. ‘‘నేను శాఖకు తిరిగి వచ్చిన నాలుగు నెలలే అయింది. ఇప్పటివరకు ఆమె నన్ను రెండు సార్లే కలిసింది. నేను ఎలాంటి వేధింపులు, బెదిరింపులు చేయలేదు. విచారణ పూర్తయిన తర్వాత సొసైటీ పుస్తకాలను తిరిగి ఇవ్వడం విచారణాధికారి బాధ్యత. ఆమె ఏడాదికాలంగా హైకోర్టు హౌసింగ్ సొసైటీ రికార్డులను తన వద్దే ఉంచుకున్నారు.
 
 అందుకే ఆమెను పిలిపించి రికార్డులు ఎందుకు తిరిగివ్వలేదని ప్రశ్నించాను. సొసైటీ కమిటీ రద్దయినందునే రికార్డులు ఇవ్వలేదని చెప్పారు. కానీ కమిటీ రద్దయినట్లు ఆధారాలు చూపలేదు. అందుకే రికార్డులు తిరిగివ్వాలని చెప్పా. కానీ ఆమె నాతో జరిగిన సంభాషణను రహస్యంగా రికార్డు చేసింది. ఒక ఉన్నతాధికారి ఆదేశాలను కింది స్థాయి అధికారి ఎలా రికార్డు చేస్తారు? అయినా నేను ఆమెను దుర్భాషలాడినట్లు నిరూపిస్తే బాధ్యత వహిస్తా. ఆమె తప్పులు చేశారు. ఆమెపై చాలా ఫిర్యాదులున్నాయి. చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాక.. తప్పించుకోడానికి ఆమె ఇలాంటి ఫిర్యాదులు చేశారు..’’ అని సురేందర్ చెప్పారు.

మరిన్ని వార్తలు