పండుగకు పస్తులే!

1 Oct, 2014 02:59 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సామాజిక భద్రతా పింఛన్ పథకం లబ్ధిదారులకు ఇది చేదు కబురే. దసరా పండుగకు పింఛన్ డబ్బులు చేతికందుతాయని భావించిన వారు నిరాశకు గురయ్యే పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో బుధవారం జిల్లావ్యాప్తంగా చెల్లింపులు నిలిపివేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ (డీఆర్‌డీఏ) మంగళవారం విడుద ల చేసిన ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబ ర్ మాసానికి సంబంధించి వృద్ధాప్య, వికలాంగ, వితంతువు, చేనేత, కల్లుగీత కార్మికులు, అభయహస్తం ఫించన్‌లను నిలిపివేయనున్నారు.

 డీఆర్‌డీఏ అధికారుల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2,84,165 మంది లబ్ధిదారులకు నెలనెలా రూ.3.16 కోట్ల మేరకు పింఛ న్లు పంపిణీ చేస్తున్నారు. 15 వేలకు పైగా దరఖాస్తులు ఏడాదిగా పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడున్న లబ్ధిదారులకు సాంకేతిక కారణాలు తరచూ ప్రతిబంధకాలు అ వుతున్నాయి. ఉగాదికి ముందు ఇదే తరహాలో ఫించన్‌లను ఆపేశారు. ఇదిలా ఉండగా, సామాజిక భద్రత ఫించన్ల పంపిణీకి పోస్టాపీసుల్లో బయోమెట్రిక్ మిషన్ లో తమ ఆధార్‌కార్డులను నమోదు చేయించుకోవా ల్సి ఉంది.

ఆధార్ సంఖ్య లేనట్లయితే ఫించన్ చెల్లించే వీలు లేదు. అధికారులే లబ్ధిదారులకు అవగాహన క ల్పించి సరైన సమయంలో ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంది. జిల్లా మొత్తంగా చూస్తే 25,52,073 మంది జనాభా ఉంటే 23,61,450 మంది (92.53 శాతం) ఆధార్‌తో అనుసంధానం అయినట్లు గణాంకా లు చెప్తున్నాయి. ఆధార్ కార్డులు లేనివారు ఎక్కువ మంది ఫించన్‌దారులే. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకం గా భావించని కారణంగా ఫించన్‌దారులకు పండగపూట చేతికి డబ్బులందకుండా పోతున్నాయి.

మరిన్ని వార్తలు