1.52 లక్షల కార్డులు ఏరివేశాం

26 Sep, 2014 00:04 IST|Sakshi

మొయినాబాద్ రూరల్:  జిల్లాలో లక్షా 52 వేల బోగస్ రేషన్ కార్డులను తొలగించామని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. గురువారం మొయినాబాద్ మండలం బాకారం, ఎనికేపల్లి గ్రామాల్లో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను పరిశీలించారు. బాకారంలో రేషన్ కార్డుకు ఆధార్  సీడింగ్ సరిగా లేకపోవడం గమనించి రేషన్ డీలరుపై, సంబంధిత అధికారులపై ఆగ్రహం
వ్యక్తం చేశారు. ప్రభుత్వం పారదర్శకత కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మీరు మొద్దునిద్రలో ఉండడమేంటని ప్రశ్నించారు.

 గ్రామంలోని 630 రేషన్ కార్డులకు 241 కార్డులకు ఆధార్ నంబర్లు సీడింగ్ కాలేదని పేర్కొన్నారు. బోగస్ రేషన్ కార్డులను గుర్తించే బాధ్యత మండల అధికారులదేనన్నారు. ఎన్ని రేషన్ కార్డులకు ఆధార్ సీడింగ్ అయింది, ఎన్నింటికి కాలేదన్న సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎనికేపల్లి గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో కేవలం ఐదుగురు పిల్లలే ఉండడంతో రోజువారీ పిల్లల హాజరుపట్టికను పరిశీలించారు. అందులో 18 మంది పిల్లల పేర్లు ఉండగా ఐదుగురే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా హాజరు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు.

 అనంతరం జేసీ ఎంవీ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. పౌరసరఫరా శాఖలో నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అందుకు జిల్లా పాలనా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని తొమ్మిది లక్షల 31 వేల 390 రేషన్‌కార్డుల్లో లక్షా 52 వేల బోగస్ కార్డులను గుర్తించి వాటిని తొలగించినట్టు చెప్పారు. మొత్తం 20 శాతం బోగస్ కార్డుల్లో ఇప్పటివరకు 15 శాతం కార్డులను ఏరివేశామని, ఇంకా ఐదు శాతం మిగిలి ఉన్నాయని తెలిపారు. రేషన్ కార్డులకు ఆధార్‌కార్డు సీడింగ్ 93 శాతం పూర్తయిందని, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, ఘట్‌కేసర్‌లలో 85 శాతమే అనుసంధానం చేశారని చెప్పారు.

 ఇంకా పూర్తికాకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. అధికారులు ఇంటింటికీ తిరిగి పూర్తి సమాచారం సేకరించాలని అన్నారు. బాకారంలో రేషన్ డీలర్ సరుకులను సరిగా సరఫరా చేయడం లేదని, రికార్డుల్లో రేషన్ తీసుకున్న వారి సంతకాలకు బదులు అన్ని వేలిముద్రలే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకాంత్, తహసీల్దార్ గంగాధర్, మండల రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, వీఆర్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, బాకారం సర్పంచ్ సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు